Vada Pav: వడా పావ్ ను విక్రయించే ముంబై వీధి వ్యాపారి నెల ఆదాయం వివరాలను వెల్లడించిన ఒక వీడియో ఇటీవల వైరల్ గా మారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సందడిగా ఉండే ఆ వడా పావ్ బండి కౌంటర్ వెనుక ఒక రోజు గడిపిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఈ అనుభవాన్ని ఒక ఆకర్షణీయమైన వీడియోలో డాక్యుమెంట్ చేశాడు. ఇది దాదాపు 40 మిలియన్ల వ్యూస్ ను సాధించింది.
ముంబైలో వడాపావ్ చాలా ఫేమస్ చిరుతిండి. వైరల్ అయిన ఆ వీడియోలో సార్థక్ సచ్ దేవా అనే వ్లాగర్ వడా పావ్ స్టాల్ రోజువారీ కార్యకలాపాలను చిత్రీకరించాడు. అక్కడ ఆ వడాపావ్ విక్రేత మధ్యాహ్నానికే సుమారు 200 వడా పావ్ లను విక్రయించాడు. సమయం గడుస్తున్న కొద్దీ అమ్మకాల సంఖ్య పెరుగుతూనే ఉంది. షిఫ్ట్ ముగిసే సమయానికి, మొత్తం 622 వడా పావ్ లు అమ్ముడయ్యాయి. ఒక్కొక్క వడాపావ్ ధర రూ .15. అంటే, ఒక్కరోజులో ఆ వడాపావ్ విక్రేతకు రూ.9,300 ఆదాయం సమకూరింది.
అంటే ఒక పూర్తి నెలలో ముంబైలోని ఆ వడాపావ్ విక్రేత ఆదాయాన్ని లెక్కిస్తే, అది సుమారు రూ .2.8 లక్షలుగా తేలింది. వివిధ నిర్వహణ ఖర్చులను లెక్కించిన తరువాత, నికర నెలవారీ ఆదాయం కనీసం సుమారు రూ .2 లక్షలు కచ్చితంగా ఉంటుందని తేలింది. అంటే, సంవత్సరానికి రూ .24 లక్షలు. ఈ ఆదాయం చూసి నెటిజన్లు కళ్లు తేలవేశారు.
ఈ వీడియో సోషల్ మీడియా (social media) లో విపరీతంగా వైరల్ అయింది. స్వల్పకాలంలోనే ఇది దాదాపు 40 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. నెటిజన్లు దీనిపై పెద్ద ఎత్తున స్పందించారు. "నా ఆఫీసు ఉద్యోగం నుండి నేను ఇంత సంపాదించగలనా?" అని ఒక యూజర్ ప్రశ్నించాడు. "మనమందరం డెస్క్ దగ్గర పనిచేయకుండా వడా పావ్ అమ్మకాలు ప్రారంభించాలి’’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు.