Sisodia resigns: ఢిల్లీ ఆప్ మంత్రుల రాజీనామా-two aap ministers manish sisodia satyendar jain quit delhi cabinet
Telugu News  /  National International  /  Two Aap Ministers Manish Sisodia, Satyendar Jain Quit Delhi Cabinet
మనీశ్ సిసోడియా
మనీశ్ సిసోడియా (HT_PRINT)

Sisodia resigns: ఢిల్లీ ఆప్ మంత్రుల రాజీనామా

28 February 2023, 20:00 ISTHT Telugu Desk
28 February 2023, 20:00 IST

Sisodia resigns: అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు.

Sisodia resigns: ఢిల్లీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా, మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలపై అరెస్టైన ఆ ఇద్దరు మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు.

2 delhi ministers resign: త్వరలో మంత్రివర్గ విస్తరణ

ఇద్దరు సీనియర్ మంత్రుల రాజీనామాల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తమ మంత్రులు పరిపాలన కారణాల వల్లనే పదవులకు రాజీనామా చేశారని, అంతేకానీ, రాజీనామా చేయడం ద్వారా తప్పును ఒప్పుకున్నట్లు కాదని ఆప్ ప్రకటించింది. మనీశ్ సిసోడియా రాజీనామా అనంతరం ఆయన నిర్వహిస్తున్న కీలకమైన ఆర్థిక శాఖ సహా 18 శాఖలను కైలాశ్ గహ్లోత్, రాజ్ కుమార్ ఆనంద్ లకు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో సీఎం కేజ్రీవాల్ సహా ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు.

Sisodia resigns: మళ్లీ వస్తా..

తాత్కాలికంగానే పదవులకు దూరమవుతున్నానని, నిర్దోషులుగా తేలిన తరువాత మళ్లీ బాధ్యతలను స్వీకరిస్తానని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా 8 ఏళ్ల పాటు నిజాయితీగా, నిబద్ధతతో సేవలను అందించానని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలను తేలేంత వరకు పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. తనపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందన్నారు. తాను తప్పేం చేయలేదన్నది ఆ దేవుడికి తెలుసన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి సంబంధించి నమోదైన కేసులో ఆదివారం సీబీఐ మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసింది. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్ చేస్తారని, కనీసం 8 నెలలు జైళ్లో ఉంచుతారని అరెస్ట్ కు ముందే సిసోడియా అంచనా వేశారు. సత్యేంద్ర జైన్ గత 10 నెలలుగా జైళ్లోనే ఉన్నారు.