Japan earthquake Tsunami : వరుసగా 21 భూకంపాలు.. ఆ తర్వాత సునామీ- అల్లకల్లోలంగా జపాన్!
Japan earthquake today : వరుస భూకంపాలతో జపాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆ వెంటనే.. సునామీ తీర ప్రాంతాలను తాకింది. అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Japan earthquake today : 2024 నూతన ఏడాది తొలి రోజు జపాన్‌కు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఆ దేశ నార్త్ సెంట్రల్ ప్రాంతంలో సోమవారం.. 21 భూకంపాలు సంభవించాయి. ఇవన్నీ 90 నిమిషాల వ్యవధిలో నమోదవ్వడం గమనార్హం. అనంతరం.. అనేక తీర ప్రాంతాలను సునామీ ఢీకొట్టింది.
జపాన్‌లో భూకంపం.. ఆ తర్వాత సునామీ!
జపాన్‌లో సోమవారం మధ్యాహ్నం వరకు అంతా సాధారణంగానే ఉంది. కానీ ఆ తర్వాత.. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జపాన్‌లోని షికావా, నైగట, టయోమా, నోటో రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు భయపెట్టాయి. నోటోలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు 5.7 తీవ్రతతో భూమి కంపించింది. ఆ వెంటనే ఇతర ప్రాంతాల్లో వరుసగా 7.6, 6.1, 4.5, 4.6, 4.8 తీవ్రతతో భూమి కంపించింది. ఆ వెంటనే వచ్చిన భూకంపం తీవ్రత.. రిక్టార్ స్కల్పై 6.2గా నమోదైంది.
Japan Tsunami live updates : వరుస భూకంపాలతో జపాన్ ఉలిక్కిపడింది. వాతావరణశాఖ అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారి చేశారు. కొంతసేపటికే.. 1.2మీటర్ల ఎత్తుగల అలలు వజిమ నగరాన్ని ఢీకొట్టాయి. మరోవైపు నోటోలోని తీర ప్రాంతంవైపు 5 మీటర్ల ఎత్తు ఉండే అలలు దూసుకెళుతున్నట్టు తెలుస్తోంది. ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. సాధారణంగా.. 30-40 సెంటీమీటర్ల అలలను తట్టుకోవడమే చాలా కష్టం. ఇక 1 మీటర్ కన్నా ఎక్కువ ఎత్తులో అలలు వస్తే.. పరిస్థితులు ఘోరంగా ఉంటాయని అంటారు.
జపాన్‌లో భూకంపం కారణంగా అనేక భవనాలు షేక్ అయ్యిపోయాయి. మెట్రో రైళ్లు, హోర్డింగ్‌లు, వీధి లైట్లు, బోర్డులు.. అన్ని విపరీతంగా కదిలిపోయాయి. ప్రజలు.. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. అనేక రోడ్లు చీలిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Tsunami in Japan latest news : మరోవైపు జపాన్‌లో సునామీకి చెందిన దృశ్యాలు కూడా ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. అలల తీవ్రత నిమిష-నిమిషానికి పెరుగుతుండటం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
భూకంపాల నేపథ్యంలో అక్కడి మీడియా సంస్థలు.. ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డాయి. "మీరు ఇంట్లో ఉండొచ్చు. లేదా ఆఫీస్‌లో ఉండొచ్చు. మీ వస్తువులు మీకు ఎంతో విలువైనవి అయ్యుండొచ్చు. కానీ అవేవీ మీ ప్రాణాల కన్నా ఎక్కువ కాదు! సునామీ ముంచుకొస్తోంది. వెంటనే మీ ఇళ్లను విడిచి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోండి," అని జపాన్ మీడియా సంస్థలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
Japan earthquake live news : జపాన్‌లో సునామీ, భూకంపం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సునామీ ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత, ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రకృతి విపత్తు కారణంగా జపాన్‌లోని దాదాపు 37వేల కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అనేక ప్రాంతాలు ఇప్పుడు అంధకారంలోకి కూరుకుపోయాయి. సెంట్రల్, తూర్పు జపాన్‌లో బుల్లెట్ రైలు సేవలు నిలిచిపోయాయి.
తాజా భూకంపం కారణంగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగాయా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను చూస్తుంటే.. అనేక చోట్ల వీది స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయని, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని స్పష్టమవుతోంది.
రష్యా.. నార్త్ కొరియాలో కూడా..!
Japan Tsunami alert 2024 : జపాన్‌లో సునామీ కారణంగా రష్యా, నార్త్ కొరియా, దక్షిణ కొరియా దేశాలు కూడా అప్రమత్తం అయ్యాయి. రష్యా తూర్పు భాగానికి అలర్ట్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. తూర్పు తీర పట్టణాల్లో వచ్చే మార్పును గమనించాలని, అవసరమైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రజలకు ఆదేశాలిచ్చింది దక్షిణ కొరియా.
జపాన్‌లో భూకంపం, సునామీ నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ముప్పు ప్రాంతాల్లోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ని విడుదల చేసింది. ఒక కంట్రోల్ రూమ్‌ని సైతం ఏర్పాటు చేసింది.
ఆ చీకటి రోజును ఇంకా మర్చిపోని జపాన్..
Earthquake and Tsunami in Japan : జపాన్‌లో భూకంపాలు సాధారణమైన విషయం. కానీ ఒక్కోసారి వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భారీ ప్రాణ, ఆస్థి నష్టం జరుగుతుంది. 2011 మార్చ్‌లో ఇదే జరిగింది. మార్చ్ 11న ఈశాన్య జపాన్‌కు సమీపంలోని సముద్రంలో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ వెంటనే.. సునామీ దూసుకొచ్చింది. నాటి ఘటనలో మరణించిన, గల్లంతైన వారి సంఖ్య 19వేలు దాటిపోయింది. ఆ తర్వాత 2022 మార్చ్‌లో 7.4 తీవ్రతతో సంభవించిన భూంకపం.. ఫుకుషిమాను గడగడలాడించింది.
సంబంధిత కథనం