Age reversing scam : ‘టైమ్​ మెషిన్​తో మీ వయస్సు తగ్గించేస్తాం’.. అంటూ 35 కోట్ల స్కామ్​!-this kanpur couple scams 35 cr from elderly with fake age reversing machine ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Age Reversing Scam : ‘టైమ్​ మెషిన్​తో మీ వయస్సు తగ్గించేస్తాం’.. అంటూ 35 కోట్ల స్కామ్​!

Age reversing scam : ‘టైమ్​ మెషిన్​తో మీ వయస్సు తగ్గించేస్తాం’.. అంటూ 35 కోట్ల స్కామ్​!

Sharath Chitturi HT Telugu
Oct 04, 2024 12:15 PM IST

UP Age reversing scam : "ఇజ్రాయెల్ మేడ్ టైమ్ మెషిన్​"తో వయస్సును తగ్గించేస్తామని, యవ్వనంగా కనిపించేలా చేస్తామని ఆ దంపతులు చెప్పిన మాటలను నమ్మారు. చివరికి రూ. 35కోట్లు నష్టపోయారు! యూపీలో జరిగిన ఈ ఘటనలో చాలా మంది వృద్ధులు బాధితులయ్యారు.

వయస్సు తగ్గించేస్తామంటే నమ్మి, రూ. 35 కోట్లు పోగొట్టుకున్నారు!
వయస్సు తగ్గించేస్తామంటే నమ్మి, రూ. 35 కోట్లు పోగొట్టుకున్నారు! (Photo for representational purpose only)

ఉత్తర్​ ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘టైమ్​ మెషిన్​తో వయస్సు తగ్గిస్తాం,’ అని చెప్పిన ఓ దంపతులను నమ్మి చాలా మంది మోసపోయారు! ఏకంగా రూ. 35 కోట్లు నష్టపోయారు.

ఇదీ జరిగింది..

రష్మీ, రాజీవ్ దూబే దంపతులు కాన్పూర్​లోని కిద్వాయ్ నగర్​లో 'రివైవల్ వరల్డ్' పేరుతో కొంతకాలం క్రితం ఓ థెరపీ సెంటర్​ను ప్రారంభించారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన టైమ్ మెషిన్​లో 'ఆక్సిజన్ థెరపీ' ఇస్తామని, ఫలితంగా మీరు యవ్వనంగా మారతారని హామీ ఇచ్చి స్థానికులను ఆకర్షించారు.

ముఖ్యంగా కాన్పూర్​లో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధాప్య ప్రక్రియ వేగవంతమైందని, ఈ 'ఆక్సిజన్ థెరపీ' వారిని వెంటనే యవ్వనంగా కనిపించేలా చేస్తుందని ప్రచారం చేశారు ఆ దంపతలు. తమ బిజినెస్​ కోసం వృద్ధులను వారు లక్ష్యంగా చేసుకున్నారు.

టైమ్ మెషిన్​లోని ఒక్కో సెషన్ ధర రూ.90 వేలు ఉంటుందని తెలుస్తోంది. కొంతకాలానికే ఇది పిరమిడ్​ స్కీమ్​గా మారింది! కస్టమర్లు ఇతరులను తీసుకొస్తే రిఫరల్స్​, డిస్కౌంట్స్​ ఇస్తామని దంపతులు చెప్పారు. అలా తమ కస్టమర్​ బేస్​ని విస్తరించుకున్నారు.

“ఈ సేవను ఇతరులకు పరిచయం చేస్తే నాకు ఉచిత సెషన్ ఇస్తామని ఆఫర్ చేశారు. చికిత్స కోసం పలువురిని తీసుకెళ్లాను,” బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ చందేల్ తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వారు దర్యాప్తును ప్రారంభించారు. వృద్ధుల నుంచి మొత్తం రూ.35 కోట్లు దోచుకున్నారని, ఇప్పటి వరకు 25 కేసులు నమోదయ్యాయని, మరింత మంది బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇతర బాధితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాజీవ్, రష్మీలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అయితే నిందితులు దేశం విడిచి వెళ్లిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు.

సైబర్​ మోసగాళ్ల నుంచి ఫోన్​- గుండెపోటుతో మృతి..

యూపీలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తె సెక్స్ స్కాండల్​లో చిక్కుకుందని సైబర్ మోసగాళ్ల నుంచి ఫోన్ రావడంతో ఆగ్రాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మృతి చెందారు.

సెప్టెంబర్ 30న మోసగాళ్లు టీచర్​ను బెదిరించి ఈ విషయం బయటకు చెప్పకుండా రూ.లక్ష డిమాండ్ చేశారు.

బాధితురాలి కుమారుడు దీపాన్షు రాజ్​పుట్​ పీటీఐతో మాట్లాడుతూ.. “మా తల్లి మాలతి వర్మ (58) ఆగ్రాలోని అచ్నేరాలోని జూనియర్ హైస్కూల్​లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. సెప్టెంబర్ 30న మధ్యాహ్నం 12 గంటలకు ఆమెకు వాట్సప్ కాల్ వచ్చింది. అందులో కుమార్తె సెక్స్ స్కాండల్​లో చిక్కుకుందని, తన కుమార్తె ఐడెంటిటీని బయటపెడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించడం ప్రారంభించారు. కాల్ చేసిన వ్యక్తి పోలీస్ ఇన్​స్పెక్టర్​గా నటించాడు,” అని రాజ్​పుట్​ తెలిపారు.

“ఆ తర్వాత ఆమె నాతో ఫోన్​లో మాట్లాడి విషయం చెప్పింది. అయితే ఫోన్ నంబర్ చెక్ చేయగా అది సైబర్ నేరగాళ్ల మోసపూరిత కాల్ అని మా అమ్మకు చెప్పాను. ఆ తర్వాత నా సోదరితో కూడా మాట్లాడాను. సైబర్ మోసానికి గురైనందున ఆందోళన చెందవద్దని అమ్మని కోరాను. అయితే ఆమె తన టెన్షన్​ను నియంత్రించుకోలేకపోయింది. ఆ కాల్ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది,” అని ఆయన చెప్పారు.

పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఛాతినొప్పితో బాధపడింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని తెలిపారు.

ఈ ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని జగదీష్ పురా పోలీస్ స్టేషన్ ఇన్​ఛార్జి ఆనంద్ వీర్ సింగ్ తెలిపారు. తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం