Thief leaves note: ‘‘దొంగతనం చేసి, క్షమించమని నోట్ పెట్టి..’’-
తమిళనాడులో ఒక మంచి దొంగ ఉదంతం బయటపడింది. ఒక ఇంట్లో దొంగతనం చేసిన ఆ దొంగ, దొంగతనం చేసినందుకు క్షమించాలని, నెలరోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని నోట్ పెట్టి వెళ్లాడు. కొంత నగదు, కొన్ని నగలు పోయాయని ఆ ఇంటి యజమాని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ మంచి దొంగ కోసం గాలిస్తున్నారు.
తూత్తుకుడి జిల్లాలోని ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తనిఖీ చేయగా కొంత నగదు, కొన్ని నగలు మాయమయ్యాయి. అయితే, వారికి అక్కడ ఆ దొంగ రాసిన నోట్ కూడా లభించింది.
మళ్లీ తిరిగిచ్చేస్తా..
79 ఏళ్ల రిటైర్డ్ ఉపాధ్యాయుడు చితిరై సెల్విన్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. రిటైర్డ్ టీచర్ అయిన సెల్విన్ కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. చెన్నైలోని తమ కుమారుడి కుటుంబాన్ని చూసేందుకు జూన్ 17న పనిమనిషికి ఇంటిని అప్పగించి వెళ్లారు. మంగళవారం రాత్రి పనిమనిషి ఇంటికి రాగా, ఇంట్లో ఎవరో దొంగతనం చేసినట్లు గమనించి పోలీసులకు ఫోన్ చేసింది.
60 వేల నగదు, రెండు జతల బంగారు ఆభరణాలు
60 వేల నగదు, రెండు జతల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను దొంగ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులకు దొంగ వారి నివాసంలో వదిలి వెళ్లిన ఓ నోట్ కనిపించింది. అందులో ‘‘నన్ను క్షమించండి. నెలరోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. మా ఇంట్లో ఒకరు అనారోగ్యంతో ఉన్నారు. అందుకే దొంగతనం చేస్తున్నా’’ అని రాసి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ కోసం గాలిస్తున్నారు.
చైనాలో కూడా ఇలాంటి ఘటనే..
గతంలో చైనాలోని షాంఘైలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. సంగ్ అనే ఓ దొంగ ఓ దుకాణంలో దొంగతనం చేసి ఆ దుకాణం యజమానికి ఒక ఉచిత సలహాతో ఒక లేఖ రాసి వెళ్లాడు. దుకాణంలో యాంటీ థెఫ్ట్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలని ఆ దుకాణం యజమానికి సూచిస్తూ మెసేజ్ పెట్టాడు. దుకాణం నుంచి ఆపిల్ మ్యాక్ బుక్, ఆపిల్ వాచ్ మాత్రం తీసుకుని వెళ్లాడు. ఆ షాప్ లోపలికి వచ్చిన తర్వాత సంగ్ సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు సేకరించి డెస్క్ పై ఉంచి నోట్ బుక్ లో ఈ ఉచిత సలహా రాసి దాన్ని ఆ ల్యాప్ టాప్ ల కుప్ప పై పెట్టి వెళ్లిపోయాడు. ‘‘డియర్ బాస్, నేను ఆపిల్ వాచ్, ఆపిల్ మ్యాక్ బుక్ మాత్రమే తీసుకున్నాను. మీరు మీ యాంటీ-థెఫ్ట్ వ్యవస్థను మెరుగుపరచాలి. మీ వ్యాపారం దెబ్బతింటుందనే భయంతో నేను మిగతా ఫోన్లు, ల్యాప్ టాప్ లు తీసుకోలేదు. మీ ల్యాప్టాప్, ఫోన్ తిరిగి కావాలంటే నన్ను సంప్రదించండి’’ అని ఆ లేఖలో రాశాడు. దీంతో పోలీసులు దొంగ వదిలివెళ్లిన ఫోన్ నంబర్, పబ్లిక్ సర్వైలెన్స్ కెమెరాల సాయంతో నిందితుడిని పట్టుకున్నారు.