Warangal : ఓనర్ ఇంటికే కన్నం వేసిన పనిమనిషి..! అక్క, ప్రియుడితో కలిసి రూ. 38 లక్షల బంగారం చోరీ - ఇలా దొరికిపోయారు
Warangal Crime News : ఓనర్ ఇంటికే కన్నం వేసింది పనిమనిషి. ఏకంగా 38 లక్షలు విలువ చేసే బంగారు నగలను కాజేసింది. ఓనర్ ఫిర్యాదుతో నిందితుల బాగోతాన్ని వరంగల్ నగర పోలీసులు(Warangal Police Commissionerate) బట్టబయలు చేశారు.
Warangal Police Commissionerate News: తాను పని చేస్తున్న ఓనర్ ఇంటికే కన్నం వేసిందో పని మనిషి. తన ప్రియుడు, అక్కతో కలిసి విడతల వారీగా 38 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొట్టేసింది. నగలు అమ్ముకుని జల్సాలు చేస్తుండటా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన వరంగల్ సుబేదారి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా(Warangal CP Amber Kishore Jha) శుక్రవారం వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బిల్యా నాయక్ తండాకు చెందిన కత్రి కల్యాణి అలియాస్ తునిగర్ కళ బతుకుదెరువు కోసం వరంగల్ నగరానికి వచ్చింది. వరంగల్ రంగశాయిపేటలో ఉంటూ హనుమకొండ సంతోష్ నగర్ లోని డాక్టర్ కీసర విక్రమ్ రెడ్డి ఇంట్లో కొద్దిరోజుల కిందట పని మనిషిగా చేరింది. ఇదిలాఉంటే కల్యాణికి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గొల్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మూడు చంటితో పరిచయం ఏర్పడింది. చంటి హనుమకొండ దీనదయాల్ నగరంలో నివాసం ఉంటుండగా.. ఆ ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.
నాలుగు దఫాలుగా దొంగతనం
డాక్టర్ విక్రమ్ రెడ్డి ఇంట్లో పని చేస్తున్న క్రమంలో కల్యాణి అక్కడున్న నగలు, నగదుపై కన్నేసింది. ఎలాగైనా బంగారాన్ని చోరీ చేసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. విలాస వంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో విషయాన్ని తన ప్రియుడు చంటితో పాటు కల్యాణికి అక్క వరుస అయ్యే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల జామతండాకు చెందిన సునీతకు చెప్పింది. దీంతో అందరూ కలిసి బంగారాన్ని చోరీ చేసేలా ప్లాన్ చేశారు. ఇంట్లో పనులు చేస్తున్న క్రమంలోనే నగలు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నాలుగు దఫాలుగా 650 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించారు. ఎవరికీ డౌట్ రాకుండా చోరీ చేసి, ఆ తరువాత ఏమీ తెలియనట్టుగానే కల్యాణి నటించసాగింది.
చోరీ సొత్తుతో జల్సాలు
డాక్టర్ విక్రమ్ రెడ్డి ఇంట్లో మొత్తంగా 650 గ్రాముల బంగారాన్ని దొంగిలించిన దుండగులు.. అందులో కొంత బంగారాన్ని అమ్మేశారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారు. అదే డబ్బుతో ఒక కొత్త కారు కూడా కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే తన ఇంట్లో నగలు పోయినట్టుగా ఆలస్యంగా గుర్తించిన విక్రమ్ రెడ్డి వెంటనే సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీసి, నిందితులను గుర్తించారు. చోరీ సొత్తుతో కొనుగోలు చేసిన కారుతో వరంగల్ కు వస్తున్నట్టు సమాచారం అందుకుని సుబేదారి సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో వెహికిల్ చెకింగ్ నిర్వహించారు. అదే సమయంలో కల్యాణి, సునీత, చంటి కారులో అక్కడికి చేరుకోగా.. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. దీంతో నిందితులు అసలు వాస్తవాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.
నిందితుల నుంచి 470 గ్రాముల బంగారు ఆభరణాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ, హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, సుబేదారి సీఐ సత్యనారాయణ రెడ్డి, ఏఎస్సైలు రాజయ్య, పర్వీన్, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, అలీ, ప్రభాకర్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని సీపీ అంబర్ కిశోర్ ఝా అభినందించారు.