EWS reservation: ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఏంటి? సుప్రీం కోర్టుకు ఎందుకు చేరింది?
EWS reservation: పార్లమెంటు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కు 10 శాతం కోటా కల్పించగా.. దానిని సుప్రీం కోర్టు తన చారిత్రక తీర్పులో సమర్థించింది. ఈకేసు పూర్వాపరాలు ఇవీ..
ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం సమంజసమేనంటూ తీర్పు ప్రకటించింది. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని చెప్పింది. అయితే ఐదింట మూడొంతుల మెజారిటీతో ఈ తీర్పు వెలువడింది. అంటే ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించగా, ఇద్దరు దీనిని వ్యతిరేకించారు.
జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ జేబీ పార్దీవాల 103వ రాజ్యాంగ సవరణను సమర్ధించారు. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ మాత్రం ‘ఆర్థిక ప్రాతిపదిక’ను తీసుకున్నప్పుడు అందులో నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను మినహాయించడం సబబు కాదని చెబుతూ 103వ రాజ్యాంగ సవరణను కొట్టివేశారు. అయితే ఆర్థిక ప్రాతిపదిక తప్పు కాదని, కొన్ని వర్గాలను మినహాయించడమే తప్పని అన్నారు.
How the reservation came about: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలా వచ్చింది?
ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019 జనవరిలో ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకటన చేసింది. విద్యా సంస్థల్లో 10 శాతం సీట్లను, నియామకాల్లో 10 శాతం పోస్టులను ఈడబ్ల్యూఎస్ కోటాగా పక్కకు పెట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా అగ్రకులాల్లో పేద వర్ణాలకు ఈ వాటా దక్కుతుంది. నెలవారీ ఆదాయం, భూమి, నివాసం తదితర పరిస్థితుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావించింది.
రిజర్వేషన్ల కేటాయింపులో ఆర్థికంగా వెనకబాటును కూడా పరిగణనలోకి తీసుకోవాలని దేశంలో చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే అగ్రవర్ణాలను సంతోషపెట్టడం ద్వారా వారిని ఓటు బ్యాంకుగా మలుచుకుంటున్నారన్న విమర్శలు చుట్టుముడుతూ రావడంతో ప్రభుత్వాలు వాటి జోలికిపోలేదు. దాంతో రిజర్వేషన్లు కేవలం దళితులు, గిరిజనులు, సామాజికంగా వెనకబడిన తరగతులకు మాత్రమే పరిమితమయ్యాయి.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలను పక్కనబెట్టాలని వచ్చిన ఓ కోర్టు తీర్పును కేంద్రం తగిన చట్టం ద్వారా బైపాస్ చేయాలని షెడ్యూలు కులాల నుంచి భారీ నిరసన ఎదురైన తరువాత కొద్దికాలానికి ఈ ఈడబ్ల్యూఎస్ చట్టంపై కేంద్రం ప్రకటన చేసింది.
What the ews law says: ఈడబ్ల్యూఎస్ చట్టం ఏం చెబుతోంది?
జనవరి 12, 2019న పార్లమెంటు 103వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లను సవరించి ఈడబ్ల్యూఎస్ కోటాను అమలులోకి తెచ్చింది. దీనికి ఉభయ సభల్లోనూ భారీగా మద్దతు లభించింది.
దీనిలో భాగంగా ఆర్టికల్ 15, 16లలో కొత్తగా ఉప నిబంధనలను చేర్చింది. ఆర్టికల్ 15 మతం, జాతి, కులం, లింగం, ప్రాంతం ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధిస్తుంది. ఆర్టికల్ 16 దేశంలోని పౌరులందరికీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలలో సమాన అవకాశాలకు హామీగా ఉంటుంది. ఈ ఆర్టికల్స్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సామాజికంగా వెనకబడినందున రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6) లను చేర్చింది. ఆర్థికంగా బలహీన వర్గాల పౌరుల ఉన్నతికి ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక నిబంధనలు రూపొందించేందుకు ఏ నిబంధనా నిరోధించదంటూ ఈ తాజా ఆర్టికల్స్ చెబుతున్నాయి.
ఆర్టికల్ 15, ఆర్టికల్ 16ను అనుసరించి ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కుటుంబ ఆదాయం, ఇతర సూచికల ఆధారంగా ఈడబ్ల్యూఎస్ కోటాను నోటిఫై చేస్తుందని గెజిట్ నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందేందుకు అభ్యర్థి కుటుంబ ఆదాయం వార్షికంగా రూ. 8 లక్షల లోపు ఉండాలని ఈ చట్టం చెబుతోంది. అలాగే 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఫ్లాటు ఉంటే 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి. ప్లాటు ఉంటే అది మున్సిపాలిటీ అయితే 100 చదరపు గజాల కంటే పెద్దగా ఉండరాదు. మున్సిపాలిటీయేతర ప్రాంతమైతే 200 గజాలు ఉండొచ్చు. ఈ చట్టం తేగానే చాలా రాష్ట్రాలు ఈ కోటాను అమలు చేయడం ప్రారంభించాయి.
ఈ కోటాను అమలు చేయడం రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. కేంద్రం సూచించిన ప్రాతిపదికనే చాలా రాష్ట్రాలు అమలు చేశాయి. కేరళ వంటి కొద్ది రాష్ట్రాలు మాత్రం అర్హత నిబంధనలను సవరించాయి.
What the ews controversy is: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వివాదం ఎందుకు?
భారత సామాజిక ఆర్థిక చరిత్రలో ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఒక ముఖ్యమైన ఘట్టం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ డిమాండ్ ఉన్నప్పటికీ తొలిసారిగా కేవలం కులం, తెగ ప్రాతిపదికగా కాకుండా ఆర్థిక ప్రాతిపదికను కూడా ఎంచుకుంది.
చాలావరకు అగ్రకులాలు తమకు రిజర్వేషన్ కావాలని రోడ్డెక్కుతూ వచ్చాయి. 1990లో తొలిసారిగా ఓబీసీ కోటా అమలు చేసినప్పుడు అలాగే 2006లో వాటిని విస్తరించినప్పుడు కూడా ఈ నిరసనలు కొనసాగాయి.
ఈ కోటా రాగానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా మంది సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ డబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు. సామాజికంగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ తదితర కులాలకు సామాజిక అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగం రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుందని, ఆర్థిక అభ్యున్నతికి సాధనంగా రిజర్వేషన్‌ను చూడలేదని పిటిషనర్లు సుప్రీం కోర్టుకు నివేదించారు.
కాగా 1992 నాటి ఇందిరా సహాని కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన రిజర్వేషన్ల గరిష్ట పరిమితి అయిన 50 శాతాన్ని ఈడబ్ల్యూఎస్ కోటా ఉల్లంఘిస్తోందని మరికొందరు ఈ పిటిషన్లను సవాలు చేశారు.
ఈడబ్ల్యూఎస్ కోటాను ఇతర రిజర్వేషన్లు పొందుతున్న వారికి.. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వర్తించకుండా నిషేధించడాన్ని కూడా మరికొందరు తప్పపట్టారు. ఆర్థిక ప్రాతిపదికను ఎంచుకున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఎందుకు మినహాయించడం అని ప్రశ్నించారు.
ఇక వైద్య విద్యలోని ఆల్ ఇండియా కోటాలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు కూడా ఓ తీర్పు ఇచ్చింది. అయితే దీనిని సుప్రీం కోర్టు తరువాత పక్కనపెట్టింది. అలాగే ఈ రూ. 8 లక్షల ప్రాతిపదికను కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
ఈడబ్ల్యూఎస్ కోటాపై ప్రభుత్వం ఏం చెప్పింది?
ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టింది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ, అసాధారణ పరిస్తితులకు మినహాయింపునిచ్చిందని గుర్తు చేసింది. అలాగే వెనకబాటు అంటే సామాజికంగా, అలాగే విద్యాపరంగా అన్న అర్థంలో నిర్వచించింది.
అలాగే ఈ కోటా కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాకు అన్యాయం జరుగుతుందన్న వాదననూ తిరస్కరించింది. మొత్తం సీట్లలో, ఉద్యోగాలలో ఆయా కోటాలకు ఉండాల్సిన సంఖ్యలో మార్పు ఉండదని చెప్పింది. వెనకబడిన వర్గాలకు సహాయకారిగా ఉండడానికి చట్టం చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. సామాజికంగా ఉన్న రిజర్వేషన్ల ఫలాల పరిధిలోకి ఈడబ్ల్యూఎస్ వర్గాలు రావడం లేదని తెలిపింది. ఒక పూట భోజనం కోసం కష్టపడుతున్న వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా దీనిని చూడాలని కోరింది. గౌరవాన్ని కాపాడడం రాజ్యాంగ విధి అయినందున ఈ కోటా దీనిని సాకారం చేస్తుందని చెప్పింది. మురికి వాడల్లో నివసించే వారు, ఉద్యోగం లేని వారు ఆకలి, అగౌరవంగా జీవించాల్సిన పరిస్థితి నుంచి ఇది తప్పిస్తుందని చెప్పింది.
పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడాల్సిన ప్రత్యేక హక్కు రాజ్యాంగ పీఠిక కల్పించిందని, ఆర్థిక ప్రాతిపదికను కొలమానంగా ఎంచుకోవడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం కాదని చెప్పింది. కేంద్ర నిర్ణయాన్ని మధ్యప్రదేశ్, అస్సోం, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు సమర్థించాయి. అయితే తమిళనాడు మాత్రం ఈ వాదనను వ్యతిరేకించింది.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రభావం ఎలా ఉండబోతోంది?
మెజారిటీ ధర్మాసనం ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని సమర్థించింది. ఈడబ్ల్యూఎస్‌ను ప్రత్యేక కేటగిరీగా ఎంచుకోవడం సహేతుకమేనని స్పష్టం చేసింది. అయితే రిజర్వేషన్ల అమలుకు ఒక కాలపరిమితి ఉండాలని, సమానత్వానికి అదొక మార్గం అవుతుందని జస్టిస్ త్రివేది అన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్ల నుంచి దూరంగా జరగడంలో ఆర్థిక ప్రాతిపదిక ఒక మొదటి అడుగుగా చూడవచ్చని అన్నారు.
రిజర్వేషన్లకు ఆర్థిక ప్రాతిపదికను ఎంచుకోవడాన్ని మొత్తం ఐదుగురు న్యాయమూర్తుల్లో ఎవరూ వ్యతిరేకించలేదు. ఈనేపథ్యంలో రానున్న కాలంలో ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లనే అంశం మరింత కీలకపాత్ర పోషించే అవకాశం ఉన్నట్టు అవగతమవుతోంది.