Ayodhya: అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ లను ప్రారంభించిన స్పైస్ జెట్; ఈ నగర వాసులకు మంచి అవకాశం
Direct flights to Ayodhya: భక్తులు, పర్యాటకులకు అందుబాటులో ఉండేలా స్పైస్ జెట్ అయోధ్య నుంచి బెంగళూరు సహా ఎనిమిది నగరాలకు నాన్ స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించింది.
ఇటీవల అయోధ్యలో ఘనంగా నూతన రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. నాటి నుంచి అయోధ్యకు భక్తులు, పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. అయోధ్యలో కొత్తగా విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో.. దేశంలోని వివిధ నగరాలను నుంచి వివిధ విమానయాన సంస్థలు డైరెక్ట్ ఫ్లైట్స్ ను ఆపరేట్ చేస్తున్నాయి.
స్పైస్ జెట్
అయోధ్య (Ayodhya) ను ఎనిమిది నగరాలతో కలిపే స్పైస్ జెట్ ప్రత్యక్ష విమాన సర్వీసును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి వీకే సింగ్ ప్రారంభించారు. ఈ విమానాల రాకపోకలతో భక్తులు, పర్యాటకులకు అయోధ్యలో కొత్తగా ప్రతిష్ఠించబడిన ఆలయంలో శ్రీరామ లల్లా దర్శనం సులభమవుతుంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిసెంబర్ 30, 2023 న ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఈ నగరాల నుంచి..
స్పైస్ జెట్ ఇప్పుడు దర్భాంగా, అహ్మదాబాద్, చెన్నై, జైపూర్, పాట్నా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల నుంచి అయోధ్యకు నాన్ స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్ లను నడుపుతోంది. అయోధ్యలో కొత్తగా ప్రతిష్టించిన బాల రాముడి దర్శనం చేసుకోవడం కోసం ఈ అవకాశాన్ని భక్తులు, పర్యాటకులు ఉపయోగించుకోవచ్చు. అయోధ్యకు నాన్ స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం కావడం వల్ల అయోధ్య కనెక్టివిటీ పెరగడమే కాకుండా పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. కాగా, అయోధ్య నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
అయోధ్య ప్రాముఖ్యత
అయోధ్య గతంలో కొన్ని కారణాల వల్ల నిర్లక్ష్యానికి గురైందని సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు. దశాబ్దం క్రితం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆలోచన కానీ, అయోధ్యకు మెరుగైన కనెక్టివిటీ కానీ ఊహకు కూడా అందనిదిగా అనిపించిందని యోగి ఆదిత్య నాథ్ వ్యాఖ్యానించారు. ‘‘అయితే, రామ్ లల్లా ఇప్పుడు తన భవ్య మందిరంలో గంభీరంగా నివసిస్తున్నారు. ఈ కల సాకారమవడాన్ని చూసి నేడు యావత్ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తోంది’’ అన్నారు.