Heatwave in India : ఇవేం ఎండలు రా బాబు.. హీట్ వేవ్‌తో 90మంది మృతి!
Heatwave in India : ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లో హీట్ వేవ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇప్పటివరకు 90మంది ప్రాణాలు కోల్పోయారు.
Uttar Pradesh heatwave : జూన్‌లో ఎండల తీవ్రత చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయి. గత మూడు రోజుల్లో.. ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోని బాలియా జిల్లాలోనే 54మంది.. హీట్ వేవ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరో 400మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ వివరాలను ఓ జాతీయ వార్తాసంస్థ వెల్లడించింది.
ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రతి రోజు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. బాలియా జిల్లాలో హీట్ వేవ్ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతోందని అక్కడి వైద్యులు చెప్పారు. అయితే.. మరణాలకు అనేక కారణాలు ఉండొచ్చని, వాటిల్లో హీట్ వేవ్ ఒకటని పేర్కొన్నారు. జూన్ 15న 23మంది, జూన్ 16న 20 మంది, జూన్ 17న 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. మృతిచెందిన వారిలో ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా? లేక హీట్ వేవ్‌తోనే మరణించారా? అన్న విషయంపై దర్యాప్తు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ రాష్ట్రాల్లో కూడా..
ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు బిహార్‌లోనూ హీట్ వేవ్ తీవ్రత అత్యంత ఆందోళనకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 44 మంది మరణించారని మరో జాతీయ మీడియా వెల్లడించింది.
భానుడి బగభగల నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సిన స్కూళ్లను ఈ నెల 24 వరకు వాయిదా వేశారు.
ఇదీ చూడండి:- AP TS Weather : ఈ నెల 19 నుంచి వర్షాలు - రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన
Heatwave in India death toll : మరోవైపు ఒడిశా, విదర్భ, పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడులో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. బిహార్ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానాం, రాయలసీమ, విదర్భాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ్ బెంగాల్‌లోని గంగా నది తీర ప్రాంతం, తెలంగాణ, సిక్కిం, తూర్పు ఉత్తర్ ప్రదేశ్లలో రానున్న రోజుల్లో హీట్ వేవ్ ఎఫెక్ట్ కాస్త ఎక్కువగా ఉండొచ్చని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం 19 నుంచి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
వర్షాలేవీ..?
Southwest monsoon 2023 : సాధారణంగా జూన్ మొదటి వారంలో ఎండలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ ఈసారి జూన్ నెల చివరికి వస్తున్నా.. ఎండల తీవ్రత భయపెడుతోంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవ్వడంతో ప్రజలకు కష్టాలు తప్పలేదు. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు.. 7న తేదీన చేరాయి. ఫలితంగా రుతుపవనాల విస్తరణ కూడా ఆలస్యమైంది.
సంబంధిత కథనం