Temple Wall Collapse : తీవ్ర విషాదం- ఆలయం గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సాగర్ జిల్లాలో ఓ ఆలయం గోడ కూలి 9 మంది చిన్నారులు మరణించారు.
మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలోని ఓ ఆలయం గోడ కూలి 9మంది చిన్నారులు మృతిచెందారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
షాహ్‌పూర్‌లోని హర్దయాళ్ బాబా ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనస్థలానికి వెళ్లారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శిథిలాల కింద నుంచి 9మంది చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని సైతం రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనలో ప్రభావితమైన వారందరు 10-15ఏళ్ల మధ్యలో ఉంటారని సమాచారం.
“ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. గోడ కూలి 9మంది చిన్నారులు మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు,” అని జిల్ల కలెక్టర్ దీపక్ ఆర్య తెలిపారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్పందించారు.
"మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఘటనతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ. 4లక్షల ఆర్థిక సాయం చేస్తుంది," అని మోహన్ యాదవ్ అన్నారు.
ఈ హర్దయాళ్ ఆలయం గోడలు దాదాపు 50ఏళ్ల క్రితం నాటివి అని తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో గోడ కూలి నలుగురు చిన్నారులు మరణించారు. బాధితుల వయస్సు 5-7 మధ్యలో ఉంటుంది. స్కూల్ నుంచి ఇళ్లకు తిరిగివెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గోడ కూలిన ఘటనలో సంబంధిత ఇంటి ఓనర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల నుంచి గోడ కూలిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఇప్పటికే 200కుపైగా మంది మరణించారు. 206 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 2,400కుపైగా నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి..
ఉత్తరప్రదేశ్ ఉస్రహర్ ప్రాంతంలోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
నాగాలాండ్ నంబర్ ప్లేట్ ఉన్న డబుల్ డెక్కర్ బస్సు రాయ్‌బరేలీ నుంచి దిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లక్నో నుంచి ఆగ్రాకు వెళుతున్న ఓ కారు రాంగ్ లేన్‌లో వెళ్లి బస్సును ఢొట్టింది.
కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం, రాంగ్ లేన్‌లోకి ప్రవేశించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంతో బస్సు రోడ్డుపక్కన ఉన్న గుంతలో పడి బోల్తా పడింది.
బస్సులో 60 మంది ఉండగా, వారిలో నలుగురు మృతి చెందారు. మిగిలిన వారు గాయపడ్డారు. మరోవైపు కారులో ఉన్న ముగ్గురూ చనిపోయారు. క్షతగాత్రుల్లో ఆరేడు మంది పరిస్థితి విషమంగా ఉందని సైఫాయి పీజీఐ సీఎంఓ డాక్టర్ వివేక్ చౌదరి తెలిపారు.
సంబంధిత కథనం