Maoists: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ; అబూజ్ మఢ్ ఎన్ కౌంటర్ లో 28 మంది నక్సలైట్ల మృతి-security forces kill 28 maoists in encounter in chhattisgarhs narayanpur ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maoists: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ; అబూజ్ మఢ్ ఎన్ కౌంటర్ లో 28 మంది నక్సలైట్ల మృతి

Maoists: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ; అబూజ్ మఢ్ ఎన్ కౌంటర్ లో 28 మంది నక్సలైట్ల మృతి

Sudarshan V HT Telugu
Oct 04, 2024 09:32 PM IST

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ లోని నారాయణ పూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో 28 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఈ సంవత్సరంఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టుల మృతి తర్వాత భద్రతా దళాలు సాధించిన అతిపెద్ద విజయం ఇదే.

అబూజ్ మఢ్ ఎన్ కౌంటర్ లో 28 మంది నక్సలైట్ల మృతి
అబూజ్ మఢ్ ఎన్ కౌంటర్ లో 28 మంది నక్సలైట్ల మృతి (HT file photo)

Abujhmad encounter: శుక్రవారం చత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. బస్తర్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నారాయణపూర్-దంతెవాడ అంతర్ జిల్లా సరిహద్దులోని అభూజ్ మఢ్ అడవిలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా భద్రతా దళాల సంయుక్త బృందం కూంబింగ్ చేస్తున్న సమయంలో వారికి మావోయిస్ట్ ల బృందం ఎదురుపడింది. దాంతో, ఎన్ కౌంటర్ ప్రారంభమైంది.

కొనసాగుతోన్న ఎన్ కౌంటర్

ఎన్ కౌంటర్ కొనసాగుతోందని, ఇప్పటి వరకు 28 మృతదేహాలను వెలికి తీశామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరరాజ్ పి తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. కంకేర్ జిల్లాలో ఏప్రిల్ 16న జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులను భద్రతా దళాలు హతమార్చిన తర్వాత భద్రతా దళాలు సాధించిన రెండో అతిపెద్ద విజయం ఇది. అబూజ్ మఢ్ మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం. అబూజ్ మఢ్ అంటే గోండి భాషలో అర్థం ‘తెలియని కొండ’ అని. ఇది 6,000 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవి. ఇది ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ సీపీఐ (మావోయిస్టు) కు చెందిన డజను మంది సీనియర్ కేడర్ నేతలు ఇప్పటికీ అక్కడే మకాం వేసినట్లు చెబుతున్నారు.

అబూజ్ మఢ్ అడవుల్లో..

ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అబూజ్ మఢ్ (Abujhmad) కు దక్షిణాన ఉన్న తుల్తులి, గెవ్డీ గ్రామాల అడవుల్లో మావోయిస్టులు తలదాచుకుంటున్నారు. మృతదేహాల కోసం బృందాలు ఇంకా గాలిస్తున్నాయని, మరికొన్ని గంటల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. భద్రతా దళాలు ఇంకా అడవిలోనే ఉన్నాయని, ఎన్కౌంటర్ పై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఏకే-47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ సంవత్సరం బస్తర్ అడవుల్లో 186 మంది మావోయిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.

రేపు గుర్తింపు ప్రక్రియ

శుక్రవారం ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో నక్సలైట్లకు సంబంధించిన పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆయుధాల సంఖ్యతో పాటు ఇతర వివరాలు, మందుగుండు సామగ్రి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. శనివారం చనిపోయిన మావోయిస్టులను గుర్తించే ప్రక్రియ చేపడతామని తెలిపారు.

ముందస్తు సమాచారంతో దాడి..

సీపీఐ (మావోయిస్టు) తూర్పు బస్తర్ డివిజన్ కు చెందిన సీనియర్ కార్యకర్తలు ఈ వారం తుల్తులి గ్రామ అడవుల్లో సమావేశం ఏర్పాటు చేశారని, అడవుల్లో పెద్ద ఎత్తున గుమికూడుతున్నారని తమకు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. ఈ సమాచారం మేరకు దంతెవాడ జిల్లా, డీఆర్జీ నారాయణపూర్ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ బృందాన్ని గురువారం రాత్రి నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ కోసం అడవికి పంపినట్లు ఓ అధికారి తెలిపారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ.. మన వీర సైనికులు సాధించిన ఈ గొప్ప విజయం అభినందనీయమన్నారు. వారి ధైర్యసాహసాలకు, అచంచల స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నాను. నక్సలిజాన్ని నిర్మూలించే మా పోరాటం పూర్తి విజయం సాధించినప్పుడే ముగుస్తుందని, ఇందుకోసం తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. రెండు జిల్లాల్లో చేపట్టిన ఈ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ లో 1000 మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Whats_app_banner