Crime news: ఆలస్యమైందని కస్టమర్ తిట్టడంతో డెలివరీ బాయ్ ఆత్మహత్య
ఆర్డర్ డెలివరీలో జాప్యం జరిగిందని కస్టమర్ తిట్టడంతో ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. మహిళా కస్టమర్ తనను తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆ యువకుడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
చెన్నైలోని కొళత్తూరులో 19 ఏళ్ల ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కిరాణా సామాన్లను డెలివరీ చేయడంలో ఆలస్యం జరిగిందని, దాంతో ఓ మహిళా కస్టమర్ తనను తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆ యువకుడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
బీకాం చదువుతూ ఫుడ్ డెలివరీ
బీకాం చదువుతున్న ఆ యువకుడు ఫుడ్ డెలివరీ సర్వీస్ లో పార్ట్ టైమ్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న కోరత్తూరులోని ఓ ఇంటికి కిరాణా సరుకులు డెలివరీ చేయాల్సి ఉండగా, అడ్రస్ దొరకడం కష్టంగా మారడంతో డెలివరీ ఆలస్యమైంది. సకాలంలో రాకపోవడంతో మహిళా కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత జాప్యంపై కంపెనీకి ఫిర్యాదు కూడా చేసింది. అంతేకాదు, మళ్లీ తన వద్దకు ఆ డెలివరీ బోయ్ ని మళ్లీ పంపొద్దని కంపెనీని కోరింది.
ఆగ్రహంతో రాయితో దాడి
దీనిపై ఆ యువకుడు ఆ యువతిపై కోపంతో, రెండు రోజుల తర్వాత ఆ యువతి ఇంటిపైకి రాయి విసిరి కిటికీ అద్దం పగులగొట్టాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రుల సమక్షంలోనే పోలీసులు అతడిని హెచ్చరించి వదిలేశారు. ఈ ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసు కేసు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పని ఒత్తిడితో ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలో చోటు చేసుకుంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలో పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతి చెందారు. 2023లో సీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన కేరళ వాసి అన్నా నాలుగు నెలలు ఈవై పుణె కార్యాలయంలో పనిచేసి జూలై 21న కన్నుమూశారు. ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మేమానీకి ఆమె తల్లి లేఖ రాస్తూ.. కంపెనీ పెట్టిన వర్క్ ప్రెజర్ కారణంగానే తన కూతురు చనిపోయిందని ఆరోపించారు.