పుణెలో తీవ్రమైన పని ఒత్తిడితో ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ ఉద్యోగిని మృతి; స్పందించిన కేంద్రం
మహారాష్ట్రలోని పుణెలో కేరళకు చెందిన ఒక యువతి తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో, కార్యాలయాల్లో పని ఒత్తిడిపై చర్చ ప్రారంభమైంది. దాంతో, వర్క్ ప్రెజర్ తో యువతి మరణించిన ఘటనపై విచారణ జరుపుతామని కేంద్రం ప్రకటించింది.
పుణెలోని బహుళజాతి కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young)లో పనిచేసే 26 ఏళ్ల ఉద్యోగి అధిక పనిభారం కారణంగా మృతి చెందినట్లు ఆమె తల్లి ఆరోపించారు. తన కూతురు అన్నా సెబాస్టియన్ పెరయిల్ (Anna Sebastian Perayil) ఆఫీస్ కు సంబంధించిన తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా చనిపోయారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young) ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీ (Rajiv Memani) కి కు ఈ మెయిల్ చేశారు. అన్నా 2024 మార్చి 19న ఈవై పుణెలో చేరారు. నాలుగు నెలల తర్వాత జూలై 20న ఆమె మరణించింది.
నాలుగు నెలలే..
కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ సీఏ పూర్తి చేసిన తరువాత ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ కు చెందిన పుణె శాఖలో ట్రైనీ చార్టర్డ్ అకౌంటెంట్ గా మార్చి నెలలో జాయిన్ అయ్యారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ తన కుమార్తెకు మొదటి ఉద్యోగం అని, కంపెనీలో చేరడంపై తన కూతురు ఎంతో సంతోషించిందని అన్నా తల్లి తన లేఖలో పేర్కొన్నారు. ‘‘అయితే కేవలం నాలుగు నెలల్లోనే ఆమె తీవ్రమైన పనిభారానికి లోనైంది. అన్నా రాత్రి పొద్దుపోయాక కూడా పని చేసేవారు. వారాంతాల్లో కూడా వర్క్ ఉండేది. చాలా రోజులు పూర్తిగా అలసిపోయి తన పేయింగ్ గెస్ట్ వసతి గృహానికి తిరిగి వచ్చేది. కొత్త ప్లేస్ లో అడ్జస్ట్ అయ్యే సమయం కూడా ఇవ్వలేదు’’ అని ఆమె ఆరోపించారు.
అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు
తన కూతురు చనిపోయిన విషయాన్ని కంపెనీకి సమాచారం ఇచ్చామని, వారి నుంచి కనీస స్పందన రాలేదని అన్నా సెబాస్టియన్ తల్లి ఆరోపించారు. తన కూతురు అంత్యక్రియలకు కూడా కంపెనీ నుంచి ఎవరూ హాజరు కాలేదని తెలిపారు. ‘‘అన్నా స్కూల్ లో, కాలేజీలో స్టడీస్ లో టాపర్ గా ఉండేది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోనూ రాణించేది. సీఏ పరీక్షల్లో డిస్టింక్షన్ తో ఉత్తీర్ణత సాధించింది. ఆమె ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో అవిశ్రాంతంగా పనిచేసింది. ఆఫీస్ లో వర్క్ రిక్వైర్మెంట్స్ ను రెస్ట్ తీసుకోకుండా పని చేసింది. అయితే పనిభారం, కొత్త వాతావరణం, ఎక్కువ గంటల పాటు అవిశ్రాంతంగా పని చేయడం ఆమెను శారీరకంగా, భావోద్వేగ పరంగా, మానసికంగా దెబ్బతీశాయి’’ అని అని అన్నా సెబాస్టియన్ తల్లి అనితా అగస్టిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓవర్ టైమ్ వర్క్
తన కూతురు ఎదుర్కొన్న పని ఒత్తిడి గురించి అనితా అగస్టిన్ మరింత వివరించారు. తన కూతురికి ఒక రిపోర్టింగ్ మేనేజర్ ఉన్నాడు. అతను తరచూ షిఫ్ట్ ముగింపు సమయంలో ఆమెకు పనిని కేటాయించేవాడు. దాంతో ఆమె ఓవర్ టైమ్ పనిచేయాల్సి వచ్చేది. అంతే కాదు, అన్నా తరచూ రాత్రులు, ఆదివారాల్లో కూడా పని చేసేది. ఆమె మేనేజర్ తరచూ మీటింగ్ లను రీషెడ్యూల్ చేసేవాడు. మౌఖికంగా కూడా పలు పనులు అప్పజెప్పేవాడు’’ అని అనితా అగస్టిన్ వివరించారు.
వైరల్ గా ఆ తల్లి లేఖ
అన్నా సెబాస్టియన్ (Anna Sebastian Perayil) తల్లి రాసిన ఈ మెయిల్ వైరల్ కావడంతో ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young) స్పందించింది. "2024 జూలైలో అన్నా సెబాస్టియన్ విషాదకరమైన, అకాల మరణంతో మేము చాలా విచారిస్తున్నాము. బాధిత కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని ఈవై తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం స్పందన
పుణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young) ఉద్యోగి అన్నా సెబాస్టియన్ (26) మృతిపై కార్మిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే గురువారం తెలిపారు. ‘‘అన్నా సెబాస్టియన్ పెరయిల్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. అసురక్షితమైన, దోపిడీతో కూడిన పనివాతావరణం ఉందన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. న్యాయం జరిగేలా చూడటానికి మేము కట్టుబడి ఉన్నాము మరియు @LabourMinistry ఫిర్యాదును అధికారికంగా స్వీకరించింది’’ అని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు మరియు కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ చేసిన పోస్ట్ కు శోభా కరంద్లాజే స్పందించారు.