S Jaishankar : ‘ఉగ్రవాదులకు రూల్స్ ఉండవు- వారిపై పోరాటానికి కూడా రూల్స్ అక్కర్లేదు!’
Jaishankar on cross-border terrorism : 2014 నుంచి.. ఇండియా.. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విధానంలో మార్పు వచ్చిందని జైశంకర్ అన్నారు. ఉగ్రవాదులకు రూల్స్ ఉండవని, వారికి సమాధానం ఇచ్చేడప్పుడు కూడా రూల్స్ అక్కర్లేదని తెలిపారు.
S Jaishankar on Terrorism : సీమాంతర ఉగ్రవాదంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్. ఉగ్రవాదులకు ఎలాంటి రూల్స్ ఉండవని.. వారికి సమాధానం చెప్పేడప్పుడు కూడా రూల్స్ ఉండకూడదని వ్యాఖ్యానించారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లు.. వాంటెడ్ టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు పాకిస్థాన్‌లో లోతుగా ఆపరేషన్లు నిర్వహిస్తోందని 'ది గార్డియన్' పత్రిక కథనం ప్రచురించిన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీశాయి.
తన పుస్తకం 'వై భారత్ మ్యాటర్స్' మరాఠీ అనువాదం ఆవిష్కరణ సందర్భంగా పుణెకు వెళ్లారు జైశంకర్. అక్కడ.. యువకులతో ముఖాముఖి సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ముంబై దాడిని జై శంకర్ ప్రస్తావించారు. ముంబైలో 26/11 దాడుల తర్వాత అందరూ పాకిస్తాన్‌కు సమాధానం చెప్పాలని భావించారని, కానీ యూపీఏ ప్రభుత్వం మాత్రం.. చర్చల్లో నిమగ్నమైపోయిందని అన్నారు. చివరికి.. "పాకిస్థాన్‌పై దాడి చేయకపోతే అయ్యే ఖర్చు కంటే ఆ దేశంపై దాడి చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువ" అని యూపీఏ తేల్చినట్టు ఆయన అన్నారు.
S Jaishankar latest news : ముంబై తరహా దాడి జరిగి.. దానిపై స్పందించకపోతే.. అలాంటి దాడి మళ్లీ జరగకుండా ఎలా అడ్డుకోగలరని ప్రశ్నించారు జైశంకర్ .
“మేము ఎల్ఓసీకి ఇటువైపు ఉన్నాము.. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని వారు (ఉగ్రవాదులు) ఆలోచించకూడదు. టెర్రరిస్టులు ఎలాంటి నిబంధనలకు లోబడి ఉండరు. టెర్రరిస్టులకు సమాధానం చెప్పడానికి కూడా ఎలాంటి రూల్స్ ఉండకూడదు,” అని అన్నారు జై శంకర్.
ఉగ్రవాదంపై వ్యవహరించే తీరులో.. 2014 నుంచి దేశ విదేశాంగ విధానంలో మార్పు వచ్చిందని జైశంకర్ అన్నారు.
India Pakistan relation : సంబంధాలను కొనసాగించడానికి అత్యంత సవాలుతో కూడుకున్న దేశం ఏది అని జైశంకర్‌ని అడిగారు. “మేము సంబంధాలను కొనసాగిస్తామా అని మీరు అడగగల దేశాలు ఉన్నాయి. నేడు అతిపెద్ద సవాలు పాకిస్థాన్. నరేంద్ర మోదీ 2014లో మాత్రమే వచ్చారు, కానీ ఈ సమస్య 2014 లో ప్రారంభం కాలేదు. ఇది 1947లో ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని, ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ఉపయోగించి చర్చల వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించబోము,” అని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం