కెనడా తీరుతోనే దౌత్యవేత్తలను వెనక్కు పిలిపించాల్సి వచ్చింది : ఎస్ జైశంకర్
India Canada Row : భారత దౌత్యవేత్తల పట్ల కెనడా వ్యవహరిస్తున్న తీరుపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. పోలీసు విచారణలో భారత హైకమిషనర్ పాల్గొనాలని కెనడా కోరిందని తెలిపారు.
భారత్, కెనడాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారత దౌత్యవేత్తల పట్ల కెనడా వ్యవహరిస్తున్న తీరులో ద్వంద్వ విధానాలు ఉన్నాయని చెప్పారు. కెనడా ప్రభుత్వం చెప్పిన విషయాలను బట్టి చూస్తే భారత దౌత్యవేత్తలు భారత్‌కు సంబంధించి అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడంలో వారికి సమస్యగా ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు.
ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ భారత హైకమిషనర్ పై పోలీసు విచారణ జరిపించాలని కోరినందున కెనడా నుంచి దౌత్యవేత్తలను పిలిపించాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కెనడా దౌత్యవేత్తలు ఇండియాకు వచ్చి సమాచారం సేకరించారని, కానీ భారతదేశం దౌత్యవేత్తలను కెనడా సరిగా చూడట్లేదని ఆయన తెలిపారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర సహకారం, సామరస్యంతో నిర్మితమయ్యాయని విదేశాంగ మంత్రి అన్నారు. ఈ విషయంలో ద్వంద్వ విధానాలు ఉండకూడదని చెప్పారు. కెనడా పౌరులు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు లేదా భారత హైకమిషనర్‌ను బహిరంగంగా బెదిరించినప్పుడు దానిని వారు భావ ప్రకటనా స్వేచ్ఛ అని పిలుస్తారని జైశంకర్ అన్నారు. కెనడా హైకమిషనర్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖపై కోపంగా ఉన్నారని ఒక భారతీయ జర్నలిస్ట్ చెబితే అది విదేశీ వ్యవహారాల్లో జోక్యంగా పరిగణించారని గుర్తు చేశారు. ఇది ద్వంద్వ విధానం కాకపోతే ఏంటని ప్రశ్నించారు.
వారి దేశంలో ఒకలాగా వ్యవహరిస్తాం, విదేశాల్లో మీకు వర్తించదనట్టుగా ఉంటున్నారని జైశంకర్ అన్నారు. ప్రపంచ క్రమం మారుతోందని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు పాశ్చాత్య దేశాలతో ఉమ్మడి వేదికపై నిలబడి ముందుండి స్పందించే స్థితిలో ఉన్నాయని చెప్పారు. ఇది పాశ్చాత్య దేశాలకు కాస్త సందిగ్ధంగా మారిందన్నారు. భారత్, కెనడాల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని, వాణిజ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయని, కానీ రాజకీయంగా సంబంధాలు క్షీణించాయని ఎస్ జైశంకర్ వెల్లడించారు.