PepsiCo ex-CEO Indra Nooyi: అమెరికాలోని భారతీయ విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి సలహాలు-pepsico ex ceo indra nooyis advice for indian students in us be watchful ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pepsico Ex-ceo Indra Nooyi: అమెరికాలోని భారతీయ విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి సలహాలు

PepsiCo ex-CEO Indra Nooyi: అమెరికాలోని భారతీయ విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి సలహాలు

HT Telugu Desk HT Telugu
Mar 22, 2024 07:33 PM IST

Indra Nooyi: పై చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి పలు కీలక సూచనలు చేశారు. యూఎస్ లోని భారతీయ విద్యార్థులు మాదకద్రవ్యాలు, మితిమీరిన మద్యపానానికి పాల్పడవద్దని సూచించారు. అనవసర ప్రమాదాలను కొని తెచ్చుకోకుండా, జాగ్రత్తగా ఉండాలని కోరారు.

పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి
పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి (AFP)

అమెరికాలోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక చట్టాలను గౌరవించాలని పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి సూచించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు, మితిమీరిన మద్యపానానికి పాల్పడవద్దని ఆమె కోరారు.

జాగ్రత్తగా ఉండండి

ఇంద్రా నూయీ చేసిన 10నిమిషాల నిడివి కలిగిన ప్రసంగం వీడియోను న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో, ‘‘యునైటెడ్ స్టేట్స్ కు రావాలనుకుంటున్న, లేదా ఇప్పటికే పై చదువుల కోసం యూఎస్ వచ్చిన మీతో మాట్లాడటానికి నేను ఈ వీడియోను రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే భారతీయ విద్యార్థులు అమెరికాలో దురదృష్టకర పరిస్థితుల్లో చిక్కుకున్న అనేక ఉదాహరణల గురించి నేను అనేక వార్తలను చదివాను, వింటున్నాను’’ అని ఇంద్రా నూయీ పేర్కొన్నారు.

చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లవద్దు

‘‘సురక్షితంగా ఉండటానికి మీరు ఏమి చేయాలో అది మీ ఇష్టం. కానీ, చట్టానికి లోబడి ఉండండి, రాత్రిపూట ఒంటరిగా చీకటి ప్రదేశాలకు వెళ్లవద్దు. మాదకద్రవ్యాలు (drugs) తీసుకోవద్దు. మితిమీరిన మద్యపానం చేయవద్దు. ఇవన్నీ విపత్తుకు దారి తీస్తాయి’’ అని ఆ వీడియోలో ఇంద్రా నూయీ వివరించారు. చదువుకోవడానికి అమెరికాకు వచ్చే విద్యార్థులు తమ విశ్వవిద్యాలయాన్ని, కోర్సును జాగ్రత్తగా ఎంచుకోవాలని, అమెరికా వంటి దేశంలో ఉన్నత విద్యను అభ్యసించడం కెరీర్లో గొప్ప మార్పునకు దారి తీస్తుందని పెప్సీ కో మాజీ సీఈఓ ఇంద్ర నూయూ తెలిపారు.

స్నేహితులను ఎంచుకోవడంలో జాగ్రత్త

‘‘కాబట్టి మీరు అమెరికాకు వచ్చిన తరువాత, మీరు ఇక్కడ అడుగుపెట్టిన తొలి నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరిని స్నేహితులుగా ఎంచుకుంటారనే విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు ఇక్కడి కొత్త అలవాట్లు, సాంస్కృతిక మార్పులను ఎదుర్కొనే విషయంలో పొరపాట్లు చేయకండి. మీకు లభించిన స్వేఛ్చను దుర్వినియోగం చేయకండి’’ అని ఇంద్రా నూయీ సూచించారు.

మాదక ద్రవ్యాలతో డేంజర్

ఫెంటానిల్ వంటి మాదకద్రవ్యాలకు (drugs) వ్యతిరేకంగా ఇంద్రా నూయీ (Indra Nooyi) మాట్లాడారు. ‘‘ఇది ప్రాణాంతకం. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇది ప్రాణాంతకం. దయచేసి ఇలాంటి ప్రమాదకరమైన, చట్టవ్యతిరేకమైన అలవాట్లు చేసుకోకండి. సరదాగా కూడా వాటి జోలికి వెళ్లకండి. ముఖ్యంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు. అమెరికాలోని చట్టాలను అర్థం చేసుకోవాలి. చట్టాలకు లోబడి ఉండాలి’’ అన్నారు.

IPL_Entry_Point