Lokesh Complaint :ఏపీలో మాదకద్రవ్యాలకు అడ్డుకట్టేయాలని ప్రధానికి లోకేష్ ఫిర్యాదు
Lokesh Complaint ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలంటూ టీడీపీ నేత నారా లోకేష్ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో గంజాయి మాఫియాపై ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లాకు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డైరక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు.
Lokesh Complaint ఆంధ్రప్రదేశ్‌లో అడ్డు అదుపు లేకుండా మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలు జరుగుతున్నాయంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో గంజాయి విచ్చలవిడిగా వాడకం, గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలపై వచ్చిన వార్తా కథనాలను ఫిర్యాదుకు జత చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో గంజాయి కేంద్రంగా మారిపోయిందని, పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారికి గంజాయి దొరుకుతోందని లేఖలో లోకేష్ ఆరోపించారు. గంజాయి మహమ్మారి పిల్లలు చదువుకునే స్కూళ్లలోకి కూడా ప్రవేశించిందని, గంజాయితో పిల్లల జీవితాలు చిద్రమైపోతున్నాయన్నారు.
వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గంజాయి మత్తులో పిల్లలు జోగుతున్నారని, దీనికి కారణం గంజాయి మాఫియాలో వైసీపీ నాయకులు కూడా భాగస్వాములు కావడమేనని ఆరోపించారు. డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ విడుదల చేసిన 2021-22 స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్టు ప్రకారం డగ్స్ లో దేశంలోనే ఏపీ ప్రధమ స్థానంలో ఉందని, 2021-22 లో కేవలం ఆంధ్రప్రదేశ్ లో 18,267.84 కేజీల నార్కోటిక్స్ సీజ్ చేశారని లోకేష్ వివరించారు.
కందుకూరు, అనకాపల్లి ప్రాంతాలలోని స్కూలు పిల్లలు కూడా గంజాయి, డ్రగ్స్‌కి బానిసలయ్యారని, గంజాయి, డ్రగ్స్ కారణంగా రాష్ట్రంలో నేరాలు సైతం విపరీతంగా పెరిగాయని ఫిర్యాదు చేశారు. యువగళం పాదయాత్రలో అనేక మంది తల్లిదండ్రులు గంజాయి, డ్రగ్స్ కారణంగా తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని ఫిర్యాదులు ఇచ్చారని పేర్కొన్నారు.
పవిత్ర తిరుమల శ్రీవారి కొండపైకి కూడా గంజాయి, డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, గంజాయి, డ్రగ్స్ దందాల్లో సంపాదించిన వేలాది కోట్లను హవాలా మార్గాల్లో విదేశాలకు పంపి తిరిగి రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారని లోకేష్ ఆరోపించారు. మాదక ద్రవ్యాల విక్రయాలతో సంపాదించిన నగదును వైసీపీ తమ రాజకీయాల కోసం వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు.
విచ్చలవిడి గంజాయి, డ్రగ్స్ దందాలపై సమగ్ర విచారణ చేయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. గంజాయి, డ్రగ్స్ ను సరఫరా చేస్తూ యువత, పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారించే బాధ్యత ప్రభుత్వ అధికారులకు అప్పగించి రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.
టాపిక్