Yediyurappa: పోక్సో కేసులో కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
Yediyurappa: కర్నాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో, బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మార్చి 14న ఆయనపై బెంగళూరులో పొక్సొ చట్టం (Pocso Act) కింద కేసు నమోదైంది.
పోక్సో కేసులో (Pocso Act) కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పపై బెంగళూరు ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. త్వరలోనే ఆయనను సీఐడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే యడ్యూరప్పకు సీఐడీ సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలో ఉన్న మాజీ సీఎం యెడియూరప్ప ఢిల్లీ నుంచి తిరిగి బెంగళూరుకు వచ్చే అవకాశం ఉంది. 17 ఏళ్ల బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మార్చి 14న బెంగళూరు పోలీసులు యెడియూరప్ప పై పోక్సో చట్టం (Pocso Act) కింద కేసు నమోదు చేశారు.
అరెస్ట్ తప్పదు
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప పై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (Pocso Act) కేసును దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిందని, అవసరమైతే ఆయనను అరెస్టు చేయవచ్చని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర గురువారం తెలిపారు. ‘‘ఈ కేసులో జూన్ 15 లోగా చార్జిషీట్ దాఖలు చేయాలి. అంతకంటే ముందు వారు (CID) చార్జిషీట్ దాఖలు చేస్తారు. అందుకు వారు విధివిధానాలను అనుసరించాల్సి ఉంటుంది. వారు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసి (కోర్టులో) హాజరుపరచాలి’’ అని ఆయన వివరించారు. యెడియూరప్పను అవసరమైతే అరెస్టు చేస్తామని పరమేశ్వర ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘అవసరమా, లేదా అని నేను చెప్పలేను, అది సీఐడీ చెప్పాలి. అవసరం అనుకుంటే ఆ పని చేస్తారు’’ అని పరమేశ్వర స్పష్టం చేశారు.
ఢిల్లీ నుంచి బెంగళూరుకు యడియూరప్ప
పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత విచారణలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2న బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని తన నివాసంలో జరిగిన సమావేశంలో తన 17 ఏళ్ల కుమార్తెపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో, యడ్యూరప్పపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 354 ఏ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సీఐడీకి కేసు బదిలీ
సదాశివనగర్ పోలీసులు ఈ కేసు నమోదు చేసిన కొన్ని గంటల్లోనే కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ తదుపరి దర్యాప్తు కోసం ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ మార్చి 14న ఉత్తర్వులు జారీ చేశారు. యడ్యూరప్పపై ఆరోపణలు చేసిన 54 ఏళ్ల మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా గత నెలలో ఇక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఈ ఆరోపణలను ఖండించిన 81 ఏళ్ల యడియూరప్ప ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. ఏప్రిల్ లో యడ్యూరప్పను కార్యాలయానికి పిలిపించిన సీఐడీ ఆయన వాయిస్ శాంపిల్ ను సేకరించింది. ఈ కేసులో సీఐడీ తరఫున వాదనలు వినిపించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPP) అశోక్ నాయక్ ను ప్రభుత్వం నియమించింది. తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ యడ్యూరప్ప ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు.