Karnataka Assembly elections : 'యడియూరప్ప లేకుండా ఎట్లయితది అప్పా…'-karnataka assembly elections political analysis on bs yediyurappa s importance in bjp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Assembly Elections : 'యడియూరప్ప లేకుండా ఎట్లయితది అప్పా…'

Karnataka Assembly elections : 'యడియూరప్ప లేకుండా ఎట్లయితది అప్పా…'

HT Telugu Desk HT Telugu
Apr 15, 2023 12:15 PM IST

Karnataka Assembly elections 2023 : కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీకి యడియూరప్ప మరోమారు కీలకంగా మారారు. ఈ రాష్ట్రంలో గెలుపు బాధ్యతలను ఆయనకే అప్పగించారు బీజేపీ పెద్దలు!

యడియూరప్ప
యడియూరప్ప (HT_PRINT)

Karnataka Assembly elections 2023 : బెంగుళూరు నగరంలోని ‘కావేరీ’ ఇంటి చుట్టూ కర్ణాటక రాజకీయాలు తిరుగుతున్నాయి. ‘కావేరీ’ అనేది.. మాజీ ముఖ్యమంత్రి బూకనాకెరె సిద్దలింగప్ప యడియూరప్ప (బీఎస్‌వై) ఇల్లు. 75 ఏళ్లపైబడిన వారికి రాజకీయాల విరమణ అనే నిబంధనను తెచ్చిన బీజేపీ పార్టీ అవసరాల కోసం కొందరి విషయంలో ఇచ్చిన మినహాయింపు నేతలలో ఈయన కూడా ఒకరు. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుతం 80 ఏళ్ల యడియూరప్పపైనే ఆధారపడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర ఎన్నికల్లో ప్రస్తుతం బీజేపీ అంటే బీఎస్‌వై.. బీఎస్‌వై అంటే బీజేపీ అనే వాతావరణం నెలకొని ఉంది. కర్ణాటక ఎన్నికల చరిత్రలో గత 38 ఏళ్ల నుంచి ఏ పార్టీ రెండోసారి వరుసగా అధికారం చేపట్టలేదు. ఈసారి చరిత్రను తిరగరాసి బీజేపీని మళ్లీ అధికారంలోకి తేవడానికి వయోవృద్ధుడైన యడియూరప్ప కృషి చేస్తున్నారు.

యడియూరప్ప చుట్టూ రాష్ట్ర రాజకీయాలు

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన బీజేపీకి దక్షిణాదిలో అధికారం దక్కేలా పునాదులేసిన ఘనత యడియూరప్పకే దక్కుతుంది. 1985లో కర్ణాటకలో కేవలం రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ఇక్కడ అధికారం చేపట్టడానికి యడియూరప్ప పోషించిన పాత్ర ఎంతో కీలకమైనది. విద్యాభ్యాసం రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్‌కు ఆకర్షితులైన ఆయన అనంతరం సంఘ్​తో పాటు బీజేపీలో కూడా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. దక్షిణ భారతదేశానికి ముఖద్వారమైన కర్ణాటకలో మొదటిసారిగా 2008లో యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

Yediyurappa BJP : రాష్ట్ర జనాభాలో 17శాతం ఉన్న లింగాయత్‌ వర్గానికి చెందిన యడియూరప్ప ఆ సామాజిక వర్గానికి పెద్దదిక్కుగా మారారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం సంక్షేమానికి అనేక చర్యలు తీసుకోవడంతో వారు ఆయనకు వెనుదన్నుగా నిలుస్తూ వచ్చారు. రాష్ట్రంలో దాదాపు 100 సీట్లలో లింగాయత్‌లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 23 మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించగా అందులో తొమ్మిది మంది లింగాయత్‌లు కావడం విశేషం. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్న లింగాయత్‌ల అనుగ్రహానికి అన్ని రాజకీయ పార్టీలు తాపత్రయపడుతున్నాయి. లింగాయత్‌లు అమితంగా ఆరాధించే యడియూరప్ప కేంద్రంగా ప్రస్తుత రాజకీయాలు సాగుతున్నాయి. గతంలో కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉన్న యడియూరప్పను తిరిగి పార్టీలో క్రియాశీలకంగా మార్చడంతో లబ్ది పొందవచ్చని ఆ పార్టీ ఆశిస్తుండగా, బీజేపీ యడియూరప్పను ఒక టిషూ పేపర్‌గా వాడుకుంటోందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.

ముఖ్యమంత్రిగా యడియూరప్పకు బ్రేకులే

యడియూరప్పను పార్టీ ప్రయోజనాలకు వాడుకున్న బీజేపీ ఆయనను సీఎంగా పూర్తిస్థాయిలో ఎప్పుడూ కొనసాగించలేదనే అసంతృప్తి లింగాయత్‌లలో నెలకొని ఉంది. 2011లో తనపై అక్రమ మైనింగ్‌ ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో లోకాయుక్తా ఆదేశానుసారం ఆయన జైలు జీవితం గడపవలసి వచ్చింది. ఈ సమయంలో పార్టీ తనకు సహకరించలేదనే అసంతృప్తితో రగలిపోయిన యడియూరప్ప కర్ణాటక జనతా ప్రకాశ్‌ పార్టీ ఏర్పాటు చేసి 2013 ఎన్నికల్లో 10శాతం ఓట్లతో 6 స్థానాలు సాధించారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో చావుదెబ్బ తగిలి 110 స్థానాలు నుంచి 40 స్థానాలకు పరిమితమయ్యిందటే ఆ పార్టీలో యడియూరప్ప పోషించగల పాత్ర ఏమిటో తెటతెల్లమయ్యింది. వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న బీజేపీ.. 2014 పార్లమెంట్‌ ఎన్నికల ముందు యడియూరప్పను తిరిగి పార్టీకి ఆహ్వానించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా మెజార్టీ సాధించడంలో విఫలమవడంతో వారం రోజుల్లోనే ప్రభుత్వం కుప్పకూలింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య యుడియూరప్ప 2019లో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Yediyurappa Karnataka elections : రెండు సంవత్సరాలు సాఫీగా కొనసాగిన యడియూరప్పను వయసురీత్యా తొలగిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇదే సమయంలో వీరశైవ లింగాయత్‌ మట్‌కు చెందిన పీఠాధిపతులు యడియూరప్పను తప్పిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బీజేపీ అధిష్టానాన్ని హెచ్చరించారు. యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వంపై పార్టీలో అసంతృప్తి నెలకొందని, సర్కారుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయనే కారణాలతో బీజేపీ అధిష్టానం యడియూరప్పను 2021లో తప్పించి లింగాయత్‌ వర్గానికే చెందిన బసవరాజ్‌ బొమ్మైను ముఖ్యమంత్రిగా చేసింది.

అప్పుడు వద్దనుకున్న బీజేపీకి ఇప్పుడు అవసరమయ్యారు

యడియూరప్పను తొలగిస్తే పార్టీకి మొదటి నుండి వెన్నుదన్నుగా ఉంటున్న లింగాయత్‌లలో పార్టీపై వ్యతిరేకత వస్తుందని భావించిన బీజేపీ అదే సామాజిక వర్గం నేత బొమ్మైను సీఎంగా చేసినా లింగాయత్‌లో అసంతృప్తి తగ్గలేదు. యడియూరప్ప కూడా నిరాశతో పార్టీకి దూరంగానే ఉన్నారు. గత జనవరిలో హుబ్లీలో అధికారిక కార్యక్రమాలకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీని యడియూరప్ప కలుసుకోకుండా తన నిరసనను తెలియజేశారు. చివరి అసెంబ్లీ సమావేశాల్లో యడియూరప్ప ప్రసంగిస్తూ ‘అసెంబ్లీలో ఇదే తన చివరి ప్రసంగం అని, భవిష్యత్తులో ఎన్నికలలో పోటీ చేయనని’ ప్రకటించారు. బొమ్మైపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఆయన పాలనతో భ్రమలు తొలగాయి. యడియూరప్పను ఏ అవినీతి కారణంతో తొలగించారో అదే అవినీతి బొమ్మై పాలనలో మరింత ఎక్కువయ్యింది. కమిషన్లు ఇవ్వనిదే పనులూ జరగడం లేదని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ‘40శాతం కమీషన్‌ సర్కారు’ అంటూ నిరసనలకు దిగడంతో పార్టీ ప్రతిష్ట అభాసుపాలయ్యింది. అదే అంశం ప్రత్యర్థి కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రమయింది.

దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీజేపీ అధిష్టానం

Yediyurappa latest news : 2024 పార్లమెంట్‌ ఎన్నికల ముందు జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందితే తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని జంకిన బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. గత ఫిబ్రవరిలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ యడియూరప్పను కలుసుకున్నారు. మార్చి నెలలో అమిత్‌షా యడియూరప్పతో కలిసి అల్పాహారం చేశారు. కేంద్ర బీజేపీ నేతలు యడియూరప్పకు అనుకూలంగా ట్వీట్లు, ప్రకటనలు గుప్పించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డులో, పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీలో యడియూరప్పకు చోటు కల్పించారు. కుటంబ పాలనపై ఇతర పార్టీలను ఎండగట్టే బీజేపీ యడియూరప్పను మచ్చిక చేసుకోవడానికి ఆయన కుమారుడు విజయేంద్రకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగించింది. 2018 ఎన్నికల్లో విజయేంద్రకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వని బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ టికెట్‌తోపాటు పార్టీ ఉపాధ్యక్ష పదవిచ్చింది. పార్టీ అనుబంధ సంఘాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించింది.

అంతా తానై నడిపిస్తున్న యడియూరప్ప

సంఘ్​ పరివార్‌ ప్రచారక్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన యడియూరప్ప బీజేపీలో మళ్లీ కీలకంగా మారారు. బీజేపీ గెలుపును తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో పీపుల్స్‌పల్స్‌ నిర్వహించిన సర్వేలో కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించి యడియూరప్పకు 25 శాతం మంది మద్దతిస్తే, ప్రస్తుత సీఎం బొమ్మైకు 20 శాతం మందే మద్దతిచ్చారు. యడియూరప్ప బీజేపీలో మళ్లీ క్రియాశీలకంగా మారడంతో ఇంతకాలం పార్టీపై అసంతృప్తిగా ఉన్న లింగాయత్‌లు తిరిగి బీజేపీకి వైపు మొగ్గు చూపుతున్నారని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది.

Karnataka elections schedule : టికెట్‌ కేటాయింపులలో అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలను కూడా పార్టీ యడియూరప్పకే అప్పగించింది. మొత్తంమీద రాష్టంలో ప్రస్తుతం బీజేపీ బాధ్యతలన్నింటినీ సీఎం బొమ్మై బదులు యడియూరప్పనే నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ లింగాయత్‌ల ఓట్ల చీలికే లక్ష్యంగా, యడియూరప్పను ఆయుధంగా చేసుకొని బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ యడియూరప్పను రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటుందని, ఆయనను ఎప్పుడూ పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగించలేదని ప్రచారం చేస్తోంది. యడియూరప్ప కృషితో బీజేపీ గట్టెక్కుతుందా లేదా రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు చరిత్ర పునరావృత్తమవుతుందా అనేది మే 13న వెలువడే ఫలితాలే తేలుస్తాయి.

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

సెల్‌నెం: 9949372280

Whats_app_banner

సంబంధిత కథనం