Reasi Attack : రియాసీ బస్ అటాక్ కేసు.. కీలక విషయాలు తెలుసుకున్న ఎన్ఐఏ
Reasi Attack : రియాసీలో బస్సుపై ఉగ్రవాదుల దాడి ఘటన మీద ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాజౌరీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పలు కీలక విషయాలను రాబట్టినగా తెలుస్తోంది.
రియాసీ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. జూన్ 9న మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. 41 మంది గాయపడ్డారు. ఎక్కువ మంది యాత్రికులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుండి వచ్చారు. ఈ ఘటనపై ఎన్ఐఏ కీలకంగా దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసును జూన్ 15న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు అప్పగించింది. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ వేగవంతం చేసింది. జూన్ 9 దాడి చేసిన ఉగ్రవాదులకు ఆహారం, సురక్షితమైన నివాసం, లాజిస్టికల్ మద్దతును ఇక్కడ నుంచే అందించినట్టుగా NIA నిర్వహించిన దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనకు సంబంధించి.. టెర్రరిస్టులు, స్థానికులకు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే కేసులో ఇప్పటికే 50 మంది వరకూ జమ్మూ కాశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఎన్ఐఏకు ఈ దాడికి సంబంధించిన కొన్ని వివరాలు తెలియడంతో రాజౌరీ జిల్లాలో సోదాలు నిర్వహించింది.
'ఈ కేసులో NIA విచారణలో భాగంగా నిర్వహించిన సోదాల్లో తీవ్రవాదులు, గ్రౌండ్ వర్కర్ల మధ్య సంబంధాలను చూపించే వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. NIA స్వాధీనం చేసుకున్న వస్తువులను పరిశీలించడం ప్రారంభించింది.' అని ఓ అధికారి చెప్పుకొచ్చారు.
ఉగ్రవాదులు జంగిల్ వార్‌ఫేర్‌లో శిక్షణ పొందారని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) దాడికి బాధ్యత వహించింది. అయితే ఆ తర్వాత వారు తమ వాదనను ఉపసంహరించుకున్నారు. ఈ ఘటనపై ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. పలు కీలక విషయాలను రాబడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందిస్తున్నారనే ఆరోపణలపై జూన్ 19న రియాసీలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన హకమ్ దిన్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. హకమ్ దాడి చేసిన వారికి ఆశ్రయం కల్పించడమే కాకుండా వారి కదలికలు, చర్యలకు సాయం చేశాడని కొంతమంది చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్ఐఏ సోదాలు చేసింది. ఇప్పటికే కార్మికులు, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధంపై విచారణ చేస్తోంది. స్వాధీనం చేసుకున్న వస్తువులను పరిశీలిస్తోంది ఎన్ఐఏ.