Surge Pricing In Hospitals : ఆసుపత్రుల్లో ధరల పెరుగుదల.. సర్జ్ ప్రైసింగ్ వసూళ్లు.. రోగులకు ఇక కష్టమే!-new trend in hospitals taking surge pricing for operation theatre know what is it ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Surge Pricing In Hospitals : ఆసుపత్రుల్లో ధరల పెరుగుదల.. సర్జ్ ప్రైసింగ్ వసూళ్లు.. రోగులకు ఇక కష్టమే!

Surge Pricing In Hospitals : ఆసుపత్రుల్లో ధరల పెరుగుదల.. సర్జ్ ప్రైసింగ్ వసూళ్లు.. రోగులకు ఇక కష్టమే!

Anand Sai HT Telugu
Oct 14, 2024 04:08 PM IST

Surge Pricing In Hospitals : ఆసుపత్రులు కొత్త పద్ధతులను పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ధరల పెరుగుదలతో రోగుల జేబులకు చిల్లుపడేలా చేస్తున్నాయని నేషనల్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. ఈ భారం బీమా కంపెనీలపైనా పడనుంది.

ఆసుపత్రుల్లో ధరల పెరుగుదల
ఆసుపత్రుల్లో ధరల పెరుగుదల (Unsplash)

ఆసుపత్రిలో చికిత్స పొందడం ఇప్పుడు ఖరీదైనదిగా మారుతోంది. ఇప్పటికే చాలా ఖరీదైనదిగా ఉంది. చాలా ఆసుపత్రులు చికిత్స కోసం సర్జ్ ధరలు వసూలు చేస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్ కోసం చూసేవారికి ఇది ఎక్కువ సమస్యగా ఉందని చెప్పాలి. దీంతో వైద్యం ఖరీదు ఎక్కువైపోతోంది. దీంతో రోగులు, బీమా కంపెనీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సర్జ్ ప్రైస్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే సాధారణం కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా ఆసుపత్రులు రోగుల నుండి సర్జ్ ప్రైస్ వసూలు చేస్తున్నాయి.

ఉదాహరణకు ఒక ఆసుపత్రిలో మునుపటి కంటే ఎక్కువ మంది రోగులు చేరినట్లయితే.. కొత్త రోగి చికిత్స కోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సరిగా చెప్పాలంటే ఏదైనా ప్రయాణం చేసుకునేటప్పుడు టికెట్ బుక్ చేసుకున్న విధానంలా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే విమానంలో ప్రయాణికుల సంఖ్య పెరిగేకొద్దీ టిక్కెట్లు ఖరీదైనవిగా మారుతాయి. 

ప్రయాణానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ ముందు బుక్ చేసుకుంటే టిక్కెట్లు అందుబాటు ధరలో ఉంటాయి. కాదు కూడదని రేపటికే వెళ్లాలని ఈరోజు టికెట్ బుక్ చేసుకుంటే ఖరీదు అవుతుంది. అప్పటికే విమానంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సేమ్ టూ సేమ్ ఆసుపత్రులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. దీంతో రోగులతో పాటు బీమా కంపెనీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఈ కొత్త ట్రెండ్‌పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఒక రోగికి ఆపరేషన్ చేయాల్సి వచ్చి, ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్లు దాదాపు నిండిపోతే.. ఆసుపత్రులు ఆపరేషన్ థియేటర్‌కు పీక్ ఛార్జ్ లేదా సర్జ్ ఛార్జ్(అదనపు ఛార్జీ) వసూలు చేస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్ నిండిపోవడంతో సర్జ్ ప్రైస్ పెరుగుతుంది. దీనితో చికిత్స కోసం వెళ్లినవారికి అదనపు వ్యయం అవుతోంది. రోగులు, బీమా కంపెనీలు పెరిగిన ఖర్చులను భరించాల్సి ఉంటుంది.

ఇలాంటి కొత్త నిబంధనల వల్ల దాదాపు 20 శాతం చికిత్స ఖర్చు పెరుగుతోందని కొన్ని బీమా కంపెనీలు అంటున్నాయి. ల్యాప్రోస్కోపీ లేదా హిస్టెరెక్టమీ వంటి సాధారణ ప్రక్రియలు కూడా ఇప్పుడు ఆసుపత్రుల కొత్త నిబంధనలలో చేర్చాయి. అంటే వీటిలో కూడా పీక్ చార్జీ అమలవుతోంది.

ఆసుపత్రులు చికిత్స కోసం వచ్చినవారిపై అనేక కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయి. దీంతో చికిత్స ఖరీదైనదిగా అవుతోంది. బీమా కంపెనీలు కూడా నష్టపోతున్నాయి. కొన్ని రోగాలకు సమగ్ర ప్యాకేజీ ఉండేది. కానీ చాలా ఆసుపత్రులు ఇందులో కూడా మార్పులు చేశాయి. వేర్వేరుగా ధరలు తీసుకుంటున్నాయని కొందరి వాదన. మెుత్తానికి సర్జ్ ప్రైస్‌తో రోగులకు ఇబ్బందులే. అయితే ఈ ఛార్జీలు కొన్ని ఆసుపత్రులు మాత్రమే వసూలు చేస్తున్నాయని కొందరు అంటున్నారు.

Whats_app_banner