National Herald Case : 3రోజులు.. 30గంటలు- రాహుల్​పై ఈడీ సంధించిన ప్రశ్నలేంటి?-national herald case what did ed ask rahul gandhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  National Herald Case : 3రోజులు.. 30గంటలు- రాహుల్​పై ఈడీ సంధించిన ప్రశ్నలేంటి?

National Herald Case : 3రోజులు.. 30గంటలు- రాహుల్​పై ఈడీ సంధించిన ప్రశ్నలేంటి?

Sharath Chitturi HT Telugu
Jun 17, 2022 07:22 AM IST

National Herald Case : రాహుల్​ గాంధీని 30 గంటల పాటు విచారించిన ఈడీ.. ఏం ప్రశ్నలు సంధించింది? ఆయన జవాబులేంటి?

<p>3రోజులు.. 30గంటలు- రాహుల్​పై ఈడీ సంధించిన ప్రశ్నలేంటి?</p>
3రోజులు.. 30గంటలు- రాహుల్​పై ఈడీ సంధించిన ప్రశ్నలేంటి? (HT_PRINT)

National Herald Case : నేషనల్​ హెరాల్డ్​ కేసు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీని మూడు రోజుల్లో దాదాపు 30గంటల పాటు విచారించింది ఈడీ. సోమవారం మరోమారు విచారణ జరపనుంది. ఈ పరిస్థితులను చూస్తే.. కేసు ఎంత తీవ్రంగా ఉందనేది స్పష్టమవుతోంది. అసలు రాహుల్​ గాంధీని ఈడీ అన్ని గంటలు ఎందుకు ప్రశ్నించింది? విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించింది? అసలు నేషనల్​ హెరాల్డ్​ కేసు ఏంటి?

ప్రశ్నలు ఇలా..

2010లో స్థాపించిన యంగ్​ ఇండియా సంస్థ ద్వారా మనీలాండరింగ్​ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ సంస్థకు రాహుల్​ గాంధీ డైరక్టర్​గా ఉన్నారు. సంస్థలో ఆయనకు 38శాతం వాటా కూడా ఉంది. అందుకే యంగ్​ ఇండియా చుట్టూనే రాహుల్​ గాంధీపై ఈడీ విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది.

యంగ్​ ఇండియా కార్యకలాపాలపై రాహుల్​ను ఈడీ ప్రశ్నించింది. యంగ్​ ఇండియా అనేది ఓ ఎన్​జీఓ అని, స్పెషల్​ ప్రొవిజనల్​ అఫ్​ కంపెనీస్​ యాక్ట్​ కింద సంస్థను ఏర్పాటు చేసినట్టు రాహుల్​ వివరించారు. ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ప్రశ్నలకు.. 'ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగం చేయలేదు,' అని కాంగ్రెస్​ సీనియర్​ నేత అన్నారు.

Rahul Gandhi ED : కానీ ఈడీ అధికారులు మాత్రం రాహుల్​పై ఒత్తిడి పెంచారు. యంగ్​ ఇండియా అనేది ఎన్​జీఓనే అయితే.. 2010 నుంచి అసలు చారిటీ కార్యకలాపాలు ఎందుకు చేయలేదు? అని ఈడీ నిలదీసింది. యంగ్​ ఇండియా తరఫున చారిటీ కార్యకలాపాలు జరిగినట్టు అయితే, అందుకు సంబంధించిన పత్రాలను చూపించాలని స్పష్టం చేసింది.

ఏజేఎల్​- యంగ్​ ఇండియా మధ్య నడిచిన ఆర్థిక లావాదేవీలపై అవగాహాన ఉందా? అని రాహుల్​ను ఈడీ అడిగింది. ఏజేఎల్​ లావాదేవీల్లో రాహుల్​ జోక్యం చేసుకున్నారా? అని కూడా ప్రశ్నించింది.

సంబంధిత వర్గాల ప్రకారం.. విచారణలో భాగంగా ఏజేఎల్​, యంగ్​ ఇండియాకు చెందిన (రాహుల్​ సంతకం చేసిన) డాక్యుమెంట్లను.. ఆయనకు చూపించింది ఈడీ.

సోమవారం మళ్లీ విచారణ..

మూడు రోజుల తర్వాత.. శుక్రవారం కూడా విచారణకు హాజరు కావాలని రాహుల్​కు చెప్పింది ఈడీ. కానీ.. తన తల్లి, కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ.. కొవిడ్​ కారణాలతో ఆసుపత్రిలో ఉన్నట్టు, విచారణకు మరో తేదీన హాజరవుతానని రాహుల్​ అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిని అంగీకరించిన ఈడీ.. రాహుల్​పై నాలుగోసారి విచారణను సోమవారానికి మార్చింది.

అసలేంటి ఈ నేషనల్​ హెరాల్డ్​ కేసు?

బ్రిటీష్​ రాజ్యంపై యుద్ధం కోసం 1938లో స్థాపించిన వార్తాపత్రికే ఈ నేషనల్​ హెరాల్డ్​. నాటి కాంగ్రెస్​ అధ్యక్షుడు జవహర్​లాల్​ నెహ్రూ.. ఈ పత్రికను ప్రారంభించారు. ఏజేఎల్​(అసోసియేటెడ్​ జర్నల్స్​ లిమిటెడ్​).. నేషనల్​ హెరాల్డ్​ పత్రికలను ప్రచురించేది.

ఈ నేషనల్​ హెరాల్డ్​ వార్తాపత్రికలో 5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు షేరుహోల్డర్లుగా ఉండేవారు.

స్వాతంత్ర్యం తర్వాత.. ఈ నేషనల్​ హెరాల్డ్​ను కాంగ్రెస్​ అన్ని విధాలుగా ఉపయోగించుకునేది. అనంతరం.. ఉర్దూ(కౌమి అవాజ్​), హిందీ(నవ్​జీవన్​)లోనూ నేషనల్​ హెరాల్డ్​ ఎదిగింది.

దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. నేషనల్​ హెరాల్డ్​ ఛైర్మన్​ పదవి నుంచి నెహ్రూ తప్పుకున్నారు.

క్రమంగా.. దేశంలో నేషనల్​ హెరాల్డ్​ ఉనికి కోల్పోతూ వచ్చింది. చివరికి 2008లో.. ఈ వార్తాపత్రిక మూతపడింది. అప్పటికే ఆ సంస్థకు రూ. 90.25కోట్ల అప్పులు ఉన్నాయి. అయితే.. అప్పులను తొలగించేందుకు.. కాంగ్రెస్​ పార్టీ.. నేషనల్​ హెరాల్డ్​కు రూ. 90.25కోట్లు ఇచ్చింది. అది కూడా రుణ రహిత అప్పులు ఇచ్చింది.

యంగ్​ ఇండియా లిమిటెడ్​ ఏంటి?

Rahul Gandhi ED case : 2009లో యూపీఏ మరోమారు అధికారంలోకి వచ్చింది. 2010లో.. యంగ్​ ఇండియా పేరుతో దేశంలో ఓ ఎన్​జీఓ ఆవిర్భవించింది.

యంగ్​ ఇండియాకు.. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ డైరక్టర్​గా ఉండేవారు. ఆయనతో పాటు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నేతలు మోతీలాల్​ వోరా, ఆస్కర్​ ఫెర్నాండేజ్​లు షేర్​హోల్డర్ బాధ్యతలు తీసుకున్నారు.

2010లో ఏజేఎల్​కు 1,057మంది షేర్​హోల్డర్లు ఉండేవారు. 2011లో ఒక్కసారిగా.. ఏజేఎల్​కు చెందిన అన్ని హోల్డింగ్స్​ను యంగ్​ ఇండియాకు బదిలీ చేసేశారు.

ఏజేఎల్​.. యంగ్​ ఇండియాలో చేరింది. రూ. 90,25కోట్ల రుణం బదులు.. రూ. 50లక్షలను యంగ్​ ఇండియాకు చెల్లించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్​ హెరాల్డ్​ ఆస్తులన్నీ యంగ్​ ఇండియా వశమయ్యాయి.

నేషనల్​ హెరాల్డ్​ స్కామ్​..!

నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారంపై 2012లో ఢిల్లీ ట్రయల్​ కోర్టులో పిటిషన్​ వేశారు న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి. ఆ తర్వాత.. ఆయన 2013లో బీజేపీలో చేరారు.

నేషనల్​ హెరాల్డ్​ విషయంలో పెద్ద స్కామ్​ జరిగిందని, దీనితో సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలకు సంబంధం ఉందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.

ఆరోపణలు ఇవే..

యంగ్​ ఇండియా షేర్​ క్యాపిటల్​ రూ. 5లక్షలుగా ఉండేది. కానీ కోల్​కతాకు చెందిన షెల్​ కంపెనీ డోటెక్స్​ మెర్చెండైజ్​ నుంచి రూ. 1కోటి అప్పు తీసుకుంది. అందులో నుంచి రూ. 50లక్షలు తీసి.. కాంగ్రెస్​కు ఇచ్చింది.

National Herald scandal : ఆ తర్వాత.. ఏజేఎల్​ను యంగ్​ ఇండియా తన సొంతం చేసుకుంది. ఢిల్లీలోని కీలక రియల్​ ఎస్టేట్​ ఆస్తుల సహా మరిన్ని నగరాల్లోని నేషనల్​ హెరాల్డ్​ అస్తులు యంగ్​ ఇండియా చేతికి వెళ్లాయి. వీటి విలువ రూ. 2వేల కోట్లు పైమాటే!

కొంత కాలం తర్వాత.. నేషనల్​ హెరాల్డ్​కు ఇచ్చిన రూ. 90.25కోట్ల అప్పును కాంగ్రెస్​ మాఫీ చేసింది. అప్పటికే కాంగ్రెస్​ చేతిలో యంగ్​ ఇండియా ఇచ్చిన రూ. 50లక్షలు ఉన్నాయి.

ఎలాంటి వాణిజ్యపరమైన కార్యకలాపాలు లేని యంగ్​ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ. 800కోట్లు ఆస్తులు ఉన్నాయి. అప్పుల రూపంలో కాంగ్రెస్​కు రూ. 90.25కోట్లు రావాల్సి ఉండగా.. కేవలం రూ. 50లక్షలే తీసుకుంది.

కాంగ్రెస్​ ఇచ్చిన రూ. 90.25కోట్లు అప్పులు కూడా అక్రమమే అని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. పార్టీ ఫండ్​లో నుంచి డబ్బులు తీసి నేషనల్​ హెరాల్డ్​కు ఇచ్చినట్టు చెప్పారు. ఇది ఐటీ చట్టాలకు వ్యతిరేకమని అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం