Mpox in India : ‘కఠిన చర్యలు తీసుకోండి’- ఇండియాలో ఎంపాక్స్ నియంత్రణకు కేంద్రం ఆదేశాలు..
భారతదేశం తన తొలి ఎంపాక్స్ క్లేడ్ 1 బీ కేసు నమోదైన తరువాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహాను జారీ చేసింది. అనుమానిత కేసులను ఐసోలేషన్ చేయడం, ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు, సన్నద్ధత తదితర అంశాలను సూచించింది.
దేశంలో ఎంపాక్స్ క్లేడ్ 1బీ మొదటి కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్వైజరీని కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసింది.
“ఈ క్లేడ్ 1 పెద్దవారిలో క్లేడ్ 2ని పోలి ఉంది. కానీ క్లేడ్ 2తో పోల్చితే క్లేడ్ 1బీ ఎంపాక్స్‌తో సమస్యల తీవ్రత అధికంగా ఉండొచ్చు. ఎంపాక్స్ అనుమానిత కేసులను ఐసొలేషన్‌లో పెట్టాలి. ఇన్ఫెక్షన్ వ్యాప్తి, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోండి,” అని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రాక్టీసెస్, రిస్క్ కమ్యూనికేషన్ స్ట్రాటజీతో పాటు టెస్టింగ్ కోసం పనిచేసే ప్రయోగశాలల జాబితాను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అందించింది.
ఈ ఎంపాక్స్ వ్యాధిని ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఎంపాక్స్ వ్యాప్తిని గురించి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (పీహెచ్ఈఐసీ)గా ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు, 2005 కింద పీహెచ్ఈఐసితో సంబంధం ఉన్న ఎంపాక్స్ వ్యాధిని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి.
ఆరోగ్య కేంద్రాల్లో ప్రజారోగ్య సంసిద్ధతను అంచనా వేయాలని రాష్ట్రాలను ఆదేశించిన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర- జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అనుమానిత, నిర్ధారిత కేసులను మేనేజ్ చేసేందుకు ఆసుపత్రులు ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చూడాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. అటువంటి సౌకర్యాల్లో శిక్షణ పొందిన మానవ వనరులతో సహా అవసరమైన లాజిస్టిక్స్, విస్తరణ ప్రణాళికను అభివృద్ధి చేయడం ఇతర అవసరాలలో ఒకటని స్పష్టం చేసింది.
"2024 పీహెచ్ఈఐసీ ఎంపాక్స్ వైరస్ క్లేడ్ 1 కు సంబంధించినది. ఇది ఎంపాక్స్ క్లేడ్ 2 కంటే ఎక్కువ విషపూరితమైనది, ఎక్కువ వ్యాప్తి చెందుతుంది," అని ఆరోగ్య శాఖ ప్రకటనలో ఉంది.
అనుమానిత ఎంపాక్స్ లక్షణాలున్న వారి నుంచి సేకరించిన నమూనాలను వెంటనే నిర్దేశిత ల్యాబ్‌లకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. పాజిటివ్ తేలిన రోగుల నమూనాను ఏ క్లేడ్? అన్నది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఐసీఎంఆర్-ఎన్ఐవీకి పంపాలి.
భారత్‌లో ఎంపాక్స్ క్లాడ్ 1 తొలి కేసు..
భారతదేశంలో ఎంపాక్స్ క్లాడ్ 1 జాతికి సంబంధించిన మొదటి కేసు ఈ నెల 23న నమోదైంది. కేరళకు చెందిన వ్యక్తిలో ఎంపాక్స్ క్లాడ్ 1 కనుగొన్నారు.
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వచ్చాడు. అతడికి ఎంపాక్స్ క్లాడ్ 1బీ ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉంది. పరిశీలనలో ఉన్నాడు. విదేశాల నుంచి వస్తూ.. ఎంపాక్స్ లక్షణాలు కలిగి ఉన్నవారు ఆరోగ్య శాఖకు తెలపాలని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం