Mpox Case In India : భారత్‌లో ఎంపాక్స్ క్లాడ్ 1 తొలి కేసు.. ఇది చాలా డేంజర్ రకం అని చెప్పిన డబ్ల్యూహెచ్ఓ!
Mpox Clade 1 case In India : భారతదేశంలో Mpox క్లాడ్ 1 మొదటి కేసు నమోదైంది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో వైరస్‌ను గుర్తించినట్టుగా అధికారులు తెలిపారు.
భారతదేశంలో ఎంపాక్స్ క్లాడ్ 1 జాతికి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) Mpoxని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడానికి దారితీసిన అదే జాతి ఇది. కేరళకు చెందిన వ్యక్తిలో Mpox క్లాడ్ 1 కనుగొన్నారు.
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి తిరిగి వచ్చాడు. అతడికి ఎంపాక్స్ క్లాడ్ 1బీ ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉంది. పరిశీలనలో ఉన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో రెండోసారి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడానికి Mpox క్లాడ్1బినే కారణం. విదేశాల నుంచి వస్తూ.. ఎంపాక్స్ లక్షణాలు కలిగి ఉన్నవారు ఆరోగ్య శాఖకు తెలపాలని అధికారులు చెబుతున్నారు.
హర్యానాలోని హిసార్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తికి ఎంపాక్స్ క్లాడ్ 2 వచ్చింది. దిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందాడు. పూర్తిగా కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యాడు.
Mpox క్లాడ్ 1బీ అనేది ఒక రకమైన మంకీపాక్స్. ఇది ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో ఉంది. తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. ఈ జాతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే ఆఫ్రికన్ దేశాలలో వందలాది మందికి ఇన్ఫెక్షన్ల తర్వాత WHO ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ సంవత్సరం ఆఫ్రికా నుండి ఇప్పటివరకు 30,000 అనుమానిత పాక్స్ కేసులు నమోదయ్యాయని, వాటిలో ఎక్కువ భాగం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పరీక్షలు అయిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఈ వైరస్ మశూచిని పోలిన లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే మంకీపాక్స్ ఇన్ఫెక్షన్‌కు పూర్తిగా నయం చేసే మందులు లేవు. రోగనిరోధక గ్లోబలిన్, యాంటీ వైరల్ మందులు మంకీ పాక్స్ చికిత్సలో వాడుతారు. మంకీపాక్స్ లక్షణాలు ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. జ్వరం, శరీరంపై దద్దుర్లు, వాపు, తలనొప్పి, అలసట ఉంటాయి. మంకీపాక్స్ ఆఫ్రికా దేశాల్లో ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే దీనితో చాలామంది మరణించారు.