crime news: అశ్లీల వీడియోలు చూసి సొంత చెల్లిలిపైనే అత్యాచారం; ఆ పై హత్య; ఈ నేరానికి అమ్మ, అక్కల సహకారం
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ టీనేజ్ పిల్లలపై చూపే దారుణ ప్రభావాన్ని ఈ నేరం కళ్లకు కడుతుంది. అశ్లీల వీడియోలు చూసి, ఒక 13 ఏళ్ల పిల్లవాడు 9 ఏళ్ల సొంత చెల్లిలి పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత తండ్రికి చెబుతుందనే భయంతో గొంతు నులిమి చంపేశాడు.
స్మార్ట్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూసి, 13 ఏళ్ల బాలుడు 9 ఏళ్ల సొంత చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పై తండ్రికి చెబుతానని ఆ బాలిక చెప్పడంతో, భయపడిపోయి, ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ నేరంలో ఆ బాలుడికి అతడి తల్లి, మరో ఇద్దరు అక్కలు సహకరించారు. ఈ దారుణం మధ్యప్రదేశ్ లోని రేవా జరిగింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పూర్తి వివరాలను మీడియాకు వివరించారు.
తల్లి, అక్కల సహకారం
మధ్యప్రదేశ్ లోని రేవా లో ఏప్రిల్ 24న 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మొబైల్ లో అశ్లీల వీడియోలు చూసి ఆమె టీనేజ్ సోదరుడు ఆమెపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశాడు. ఆ తర్వాత అతని తల్లి, అతని ఇద్దరు అక్కలు ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ఆ బాలుడికి సహకరించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 50 మందిని విచారించిన అనంతరం, సాంకేతిక ఆధారాల ఆధారంగా బాధితురాలి 13 ఏళ్ల సోదరుడు, అతడి తల్లి, 17, 18 ఏళ్ల అతడి అక్కలను అదుపులోకి తీసుకున్నారు.
పాము కరిచి చనిపోయిందని అబద్ధం..
ఎస్పీ వివేక్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 24న జావా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటి వెనుక వైపు తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఆ బాలిక పాము కరవడంతో చనిపోయిందని ఆ బాలిక తల్లి, ఇతర కుటుంబ సభ్యలు పోలీసులకు చెప్పారు. కానీ, పోస్ట్ మార్టం నివేదికలో అత్యాచారం జరిగినట్లుగా, గొంతు నులిమి చంపినట్లుగా తేలడంతో పోలీసులు దర్యాప్తు కోసం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ బాలిక కుటుంబ సభ్యులను లోతుగా విచారించారు.
పోర్న్ వీడియోలు చూసి..
విచారణలో పోలీసులకు అసలు విషయాన్ని నిందితులు చెప్పారు. ఆ బాలిక అన్న 13 ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూసేవాడు. హత్య జరిగిన రోజు రాత్రి ఆ బాలిక పక్కనే పడుకుని, ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఏడుస్తూ తమ తండ్రికి చెబుతానని అనడంతో, భయపడిపోయి, ఆ బాలిక గొంతు నులిమాడు. ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం, ఈ విషయాన్ని తన తల్లిని నిద్రలేపి ఆమెకు చెప్పాడు. అప్పటికీ, ఆ బాలిక బతికే ఉండడంతో మళ్లీ ఆమెను మరోసారి గొంతు నులిమి చంపేశాడు.
నేరానికి అమ్మ, అక్కల సహకారం
ఈ గొడవకు అదే ఇంట్లో ఉన్న ఇద్దరు అక్కలు కూడా నిద్ర లేచారు. ఈ నేరం నుంచి ఆ బాలుడిని కాపాడడం కోసం ఆ తల్లి, ఇద్దరు అక్కలు అతడికి సహకరించారు. ఆ బాలిక మృతదేహాన్ని వారంతా కలిసి ఇంటి వెనుక పడేశారు. మర్నాడు ఉదయం ఏడుస్తూ, ఆ బాలిక పాము కాటుతో చనిపోయిందని ఇరుగుపొరుగుకు చెప్పారు. కానీ, సమాచారం పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నేరం బయటపడింది.
పోలీసుల విచారణ
కుటుంబ సభ్యులను, ముఖ్యంగా ఆ బాలుడు, అతడి తల్లి, ఇద్దరు అక్కలను పోలీసులు పలుమార్లు లోతుగా విచారించారు. చివరకు వారు తమ నేరాన్ని అంగీకరించారు. బాలుడు, అతని ఇద్దరు సోదరీమణులు, వారి తల్లిని అదుపులోకి తీసుకున్న తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాలు సేకరించి 50 మందిని విచారించిన పోలీసులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాల్లో పదేపదే మార్పులు చేసినట్లు గుర్తించారు. అనుమానంతో వారిని తీవ్రంగా విచారించగా నేరం అంగీకరించారని ఎస్పీ తెలిపారు.