Snake bite : ఈ వ్యక్తిని ప్రతి శనివారం పాము కాటేస్తోంది- 40 రోజుల్లో 7సార్లు!
UP Snake bite case : తనని ఓ పాము 40 రోజుల్లో 7సార్లు కాటేసిందని, చికిత్సకే డబ్బులు అయిపోయాయని ఓ వ్యక్తి చెబుతున్నాడు. తనకు ఆర్థిక సాయం చేయాలని అధికారులను కోరుతున్నాడు. ఈ ఘటన యూపీలో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ నుంచి వెలుగులోకి వచ్చిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాము తనని 40 రోజుల్లో 7సార్లు కాటేసిందని ఓ 24ఏళ్ల వ్యక్తి చెప్పాడు. ఇదే విషయంపై ఆర్థిక సాయం కావాలంటూ అధికారుల దగ్గరికి వెళ్లాడు. కానీ..
ఇదీ జరిగింది..
యూపీలోని ఫతేహ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. సంబంధిత వ్యక్తి పేరు వికాస్ దూబే. తనను పాము 7సార్లు కాటేసిందని, డబ్బంతా చికిత్సకే అయిపోయిందని చెబుతూ.. తనకి ఆర్థిక సాయం చేయాలని అధికారుల వద్దకి వెళ్లాడు.
ఈ విషయంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజివ్ నయన్ గిరి స్పందించారు.
"వికాస్ దూబే కలక్టరేట్ వద్దకు వచ్చాడు. పాము కాటుకు చికిత్స చేయించుకోవడానికి డబ్బులు అయిపోయాయని అన్నాడు. ఆర్థిక సాయం చేయాలని అడిగాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, పాము కాటుకు మందులు ఉచితంగా తీసుకోవాలని చెప్పాను," అని రాజివ్ గిరి మీడియాకు చెప్పారు.
"వికాస్ దూబేని 40 రోజుల్లో 7సార్లు పాము కాటేసింది. ప్రతి శనివారం అతను పాము కాటుకు గురవుతుండటం అనుమానాలను రేకెత్తిస్తోంది," అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
ఇదీ చూడండి:- Crime news : 16ఏళ్ల స్నేహితుడిని నడిరోడ్డు మీద కిరాతకంగా చంపిన 15ఏళ్ల బాలుడు.. కారణం ఒక అమ్మాయి!
"అసలు అతడిని నిజంగానే పాము కాటేస్తోందా? అన్నది తెలుసుకోవాలి. అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్‌పైనా అనుమానాలు ఉన్నాయి. ఓ వ్యక్తిని, పాము ప్రతి శనివారం కాటేయడం, అతను ఒకటే ఆసుపత్రిలో చేరడం, చికిత్స తీసుకుని మరుసటి రోజే రికవరీ అయిపోయి, డిశ్చార్జ్ అయిపోవడాన్ని వింటుంటే అనుమానంగా ఉంది," అని రాజివ్ గిరి అన్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు, వారి రిపోర్ట్ అనంతరం అసలు విషయం బయటకు వస్తుందని రాజివ్ గిరి తెలిపారు.
"ఈ వ్యవహారంలో చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే దర్యాప్తు చేసి, నిజం తెలుసుకునేందుకు టీమ్‌ని ఏర్పాటు చేశాము," అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పుకొచ్చారు.
అధికారుల ప్రకారం.. ప్రతిసారి పాము కాటుకు గురవ్వడం, ఒకే ఆసుపత్రిలో దూబే చేరడం, చికిత్స అనంతరం రికవరీ అయిపోయి ఇంటికి వెళ్లిపోవడం జరుగుతోంది.
మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే వైద్యుల రిపోర్ట్ వరకు ఎదురుచూడాలి.
మరోవైపు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త విన్నవారందరు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “40 రోజుల్లో 7సార్లు పాము కాటుకు గురయ్యాడా? నమ్మడానికి కష్టంగా ఉంది,” అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “ఈ స్టోరీ చాలా అనుమానంగా ఉంది,” అని మరొకరు అన్నారు.
వాస్తవానికి పాము కాటుకు సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలం ఎక్కువగా వినిపిస్తున్నాయి. తనను కరిచిన పామును తిరిగి కొరిచాడు ఓ వ్యక్తి. అతను బతికాడు కానీ ఆ పాము మాత్రం చనిపోయింది. బిహార్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం