Man bites Snake: తనను కరిచిన పామును తిరిగి కొరికిన మనిషి; ఆ మనిషి బతికాడు కానీ..
Man bites Snake: బిహార్లో వింత, అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని పాము కరిచింది. ఆ పామును ఆ వ్యక్తి తిరిగి రెండు సార్లు కరిచాడు. పాము కరిచిన మనిషి సురక్షితంగా ఉండగా, ఆ పాము మాత్రం చనిపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Man bites Snake: ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్కను మనిషి కరిస్తే వార్త’ అనేది జర్నలిజం లెస్సన్స్ లో ఒకటి. అలాంటి వార్త ఒకటి బిహార్ లో వెలుగు చూసింది. అయితే, ఇక్కడ మనిషి కరిచింది కుక్కను కాదు.. పామును. వింత ఏమిటంటే, ఆ పాము చనిపోయింది. ఆ పాము కరిచిన మనిషి మాత్రం చికిత్స అనంతరం సురక్షితంగా బయటపడ్డాడు. తనను కరిచిన పామును తిరిగి కరిస్తే, పాము విషం ప్రభావం తనపై ఉండదనే నమ్మకంతో తనను కరిచిన పామును తిరిగి కొరికానని ఆ వ్యక్తి చెప్పాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే
బిహార్ లోని రాజౌలీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ లు వేస్తున్న బృందంలో 35 ఏళ్ల రైల్వే ఉద్యోగి సంతోష్ లోహర్ ఒకరు. మంగళవారం రాత్రి రోజంతా పని ముగించుకుని నిద్రలోకి జారుకున్న సంతోష్ పాము కాటుకు గురయ్యాడు. వెంటనే స్పందించిన లోహర్ ఆ పామును గట్టిగా పట్టకుని తిరిగి రెండుసార్లు కొరికాడు. తనను కరిచిన పామును తిరిగి కరిస్తే, పాము విషం ప్రభావం తనపై ఉండదనే నమ్మకంతో తనను కరిచిన పామును తిరిగి కొరికానని సంతోష్ చెప్పాడు. పాము కాటుకు గురైన వ్యక్తి ఆ పామును తిరిగి కరిస్తే, విషం తిరిగి పాముకు బదిలీ అవుతుందని భారత్ లోని కొన్ని ప్రాంతాలలో విశ్వసిస్తారు.
వెంటనే ఆసుపత్రికి..
పాము కరిచిన వెంటనే సంతోష్ సహోద్యోగులు రాజౌలి సబ్ డివిజన్ ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా ఆసుపత్రిలో ఉంచి మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు. సరైన సమయంలో చికిత్స అందడంతో సంతోష్ సురక్షితంగా బయటపడ్డాడు. కానీ, సంతోష్ కొరికిన పాము మాత్రం చనిపోయింది.
ఏటా 50 వేల మంది
భారత్ లో పాముకాటుతో ఏటా 50 వేల మంది చనిపోతున్నారు. సంవత్సరానికి కనీసం 30 నుంచి 40 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. పాముల్లో సాధారణ క్రైట్, ఇండియన్ కోబ్రా, రస్సెల్ వైపర్, సా స్కేల్డ్ వైపర్ లు అత్యంత విషపూరితమైనవి. మరో ఘటనలో, ఇండోనేషియాలో 30 ఏళ్ల మహిళను కొండచిలువ తినేసింది. ఆమె భర్త ఆమెను వెతుక్కుంటూ వెళ్లగా 30 అడుగుల పాము నోటిలో ఆమె పాదాలు కనిపించాయి. అతను పాముపై దాడి చేసి చంపాడు, కానీ అప్పటికే దురదృష్టవశాత్తు ఆ మహిళ చనిపోయింది.