Gold Rate Reduce : బడ్జెట్‌లో కీలక ప్రకటన.. మొబైల్ ఫోన్, బంగారం, వెండి ధరలు తగ్గుతాయి
Budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పలు రంగాలకు కీలక కేటాయింపులు చేశారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ కూడా తగ్గించారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి తన ఏడో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. కొన్ని రంగాలకు కీలక కేటాయింపులు చేశారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనవాటిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టుగా కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీని తరువాత, అనేక వస్తువులు వినియోగదారులకు చౌకగా, ఖరీదైనవిగా మారాయి.
BJP నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ బడ్జెట్ భారతదేశ ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి నుండి సామాజిక సంక్షేమ కార్యక్రమాల వరకు ప్రతిదానిని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు నిత్యం ధరలు అధికంగా ఉండే వాటిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి, రాగి ధరలను తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
ధరలు తగ్గేవి
మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బీసీడీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు.
క్యాన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపునిచ్చారు. సోలార్ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మినహాయింపు పొందిన మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని కూడా ఆర్థికమంత్రి ప్రతిపాదించారు.
భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించే ప్రయత్నంలో కెమెరా లెన్స్‌లతో సహా వివిధ భాగాలపై దిగుమతి పన్నులను తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీలపై పన్ను రేటును కూడా తగ్గించారు. ఈ విధానం మార్పు భారతదేశంలో ఫోన్‌లను తయారు చేయడానికి కంపెనీలకు చౌకగా అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇ-కామర్స్‌పై TDS రేటు 1 శాతం నుండి 0.1 శాతానికి తగ్గించారు. ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగించారు.
ధరలు పెరిగేవి
అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్‌లపై 25 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. నిర్దేశిత టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 10 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది.