Bhangarh fort mystery : తాంత్రికుడి శాపంతో మరణించిన యువరాణి- అప్పటి నుంచి ఆ కోటలో దయ్యం శబ్దాలు..!-most haunted place in india bhangarh fort horror story will scare you ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bhangarh Fort Mystery : తాంత్రికుడి శాపంతో మరణించిన యువరాణి- అప్పటి నుంచి ఆ కోటలో దయ్యం శబ్దాలు..!

Bhangarh fort mystery : తాంత్రికుడి శాపంతో మరణించిన యువరాణి- అప్పటి నుంచి ఆ కోటలో దయ్యం శబ్దాలు..!

Sharath Chitturi HT Telugu
Oct 14, 2024 10:02 AM IST

Most haunted place in India : ‘ది మోస్ట్​ హాంటెడ్​ ప్లేస్​ ఇన్​ ఇండియా’గా గుర్తింపు పొందిన భాన్​గఢ్​ కోట మిస్టరీ గురించి మీకు తెలుసా? ఇక్కడ రాత్రిళ్లు వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. నల్ల చీర కట్టుకున్న ఓ మహిళ నీడ కనిపిస్తుంది. వస్తువులు వాటంతట అవే కదులుతుంటాయి. దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది.

భాన్​గఢ్​ కోట మిస్టరీ ఏంటి? ఇక్కడ దయ్యం ఉందా?
భాన్​గఢ్​ కోట మిస్టరీ ఏంటి? ఇక్కడ దయ్యం ఉందా?

2009లో వచ్చిన అరుంధతి సినిమా మనందరిని భయపెట్టే ఉంటుంది. అందులో యువరాణిని- తాంత్రికుడు తన వశం చేసుకునేందుకు ప్రయత్నించడం, ఆమె అతడిని చంపడం, ఆ తర్వాత అతను తిరిగొచ్చి విధ్వంసం సృష్టించడాన్ని చూసి మనం భయపడిపోయాము. కానీ ఇంచుమించు అరుంధతి సినిమాలో చూపించినట్టుగానే, రాజస్థాన్​లో ఒక సంఘటన జరిగిందని మీకు తెలుసా? ఓ తాంత్రికుడిని యువరాణి చంపించడం, అతని శాపంతో ఆమె ప్రాణాలు కోల్పోవడం.. ఇలా ఇక్కడ చాలా జరిగాయి! ఆ తర్వాత నుంచి అల్వార్​లో ఉన్న ఈ భాన్​గఢ్​ కోటని 'మోస్ట్​ హాంటెడ్​ ప్లేస్​ ఇన్​ ఇండియా'గా పిలుస్తుంటారు. ఈ కథ ఏంటి? కోట చుట్టూ ఉన్న మిస్టరీ ఏంటి?

భాన్​గఢ్​ కోట మిస్టరీ.. నిజంగానే దయ్యం ఉందా?

భాన్​గఢ్​ కోట చుట్టూ రెండు కథలు ఎక్కువగా ప్రాచూర్యంలో ఉన్నాయి. ఒక ఒక రాజుకు, ఒక సాధువుకు మధ్య జరిగిన సంఘటన, ఇంకోటి- తాంత్రికుడు, యువరాణి విషాద కథ!

హాంటెడ్​ స్టోరీ 1:-

పూర్వం ఈ భాన్​గఢ్​ కోట కట్టక ముందు, ఆ ప్రాంతంలో ఒక సాధువు ఉండేవాడట. స్థానిక రాజు మధో సింగ్​.. ఆ ప్రాంతంలో ఒక కోట కట్టాలని, అందుకు అనుమతివ్వాలని ఆ సాధువును అభ్యర్తించాడు. అందుకు ఆ సాధువు.. కాస్త దూరం జరిగి, "కోట కట్టుకోండి. కానీ ఆ కోట నీడ నా మీద పడకూడదు. పడితే అపరా నష్టం జరుగుతుంది, జాగ్రత్తా!" అని హెచ్చరించాడు. సాధువుపై నీడ పడకుండా కోటను కట్టుకున్నాడు మధో సింగ్​. కానీ మధో సింగ్​ వారసుల్లో ఒకరు.. కోటను విస్తరించేందుకు ప్రయత్నించాడు. ఫలితంగా కోట నీడ ఆ సాధువు మీద పడింది. కొంతకాలానికే ఆ కోట, దాని పరిసర గ్రామాలపై కొందరు దండయాత్ర చేశారు. అందరిని చంపేశారు!

హాంటెడ్​ స్టోరీ 2:-

ఇది ఒక తాంత్రికుడు- యువరాణి రత్నావతి కథ. అది యువరాణి రత్నావతి కుటుంబం ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న సమయం. ఆమె చాలా అందంగా ఉండేది. ఓరోజు, ఓ తాంత్రికుడు, యువరాణి రత్నావతిని చూసి మనసుపడ్డాడు. ఆమెను తన వసం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఓ సందర్భంలో యువరాణి రత్నావతి, తన స్నేహితులతో కలిసి మార్కెట్​కి వెళ్లింది. అక్కడ ఒక సెంటు కొనుగోలు చేసింది. అయితే, ఆ సెంటులో అప్పటికే ఆ తాంత్రికుడు క్షుద్రపూజలు చేసిన మత్తుమందు కలిపాడని చెబుతుంటారు. ఆ విషయాన్ని పసిగట్టిన రత్నావతి, ఆ తాంత్రికుడిని పట్టుకోవాలని సైనికులకు ఆదేశించింది. సైనికులు అతడిని పట్టుకున్నారు. అనంతరం తాంత్రికుడిని బండరాయితో తొక్కించి రత్నావతి చంపించింది. అయితే, మరణానికి ముందు, ఆ తాంత్రికుడు ఒక శాపం వదిలాడు. రత్నావతితో పాటు ఆమె ఉండే కోట, పరిసర ప్రాంతాలు నాశనమవుతాయని శపించాడు. అప్పటి నుంచి ప్రజలు భయంభయంగా బతకడం మొదలుపెట్టారు.

ఈ ఘటన జరిగిన కొంత కాలానికే ఆ ప్రాంతంపై ముఘల్​ సైనికులు దండయాత్ర చేశారు. గ్రామాల్లో విధ్వంసం చేశారు. కోటను తమ వశం చేసుకుని, యువరాణి రత్నావతి, ఆమె కుటుంబాన్ని చంపేశారు!

అప్పటి నుంచి ఆ కోట వార్తల్లో నిలిచింది. రత్నావతి కథ చాలా ప్రాచుర్యం పొందింది. చాలా మంది అటు వెళ్లడానికి భయపడటం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా రాత్రిళ్లు కోట దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేసేవారు.

రోజులు, దశాబ్దాలు, శతాబ్దాలు గడిచాయి. ఈ భాన్​గఢ్​ కోట అందాలకు మంచి గుర్తింపు లభించింది. ఉదయం పూట సందర్శకులతో ఈ కోట కళకళలాడుతుంది. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత ఇక్కడికి వెళ్లడం నిషేధంగా భావిస్తుంటారు.

కానీ కొందరు ఔత్సాహికులు మాత్రం రాత్రిళ్లు ఈ కోటలోకి వెళ్లారు. ఉష్ణోగ్రతలు సడెన్​గా పడిపోయాయని, ఏవో వింత శబ్దాలు వినిపించాయని, గజ్జల శబ్దాలు- గాజులు శబ్దాలు, అరుపులు వినిపించాయని వారు చెప్పారు. అంతేకాదు.. నల్ల చీర కట్టుకున్న ఒక మహిళ నీడ కూడా కోటలో తిరుగుతూ కనిపించిందని వారు పేర్కొన్నారు. కోటలో వస్తువులు వాటంతట అవే కదులుతుంటాయని కూడా నివేదికలు చెబుతున్నాయి.

ఈ వార్తలు మరింత కలకలం రేపాయి. అప్పటి నుంచి ఈ భాన్​గఢ్​ కోటలో దయ్యం ఉందన్న స్థానికుల నమ్మకం మరింత పెరిగింది. అటువైపు వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయరు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్