Morocco quake: మొరాకో భూకంప విషాదం; వెయ్యి దాటిన మరణాలు
Morocco quake: భారీ భూకంపం మొరాకోను కోలుకోలేని దెబ్బ తీసింది. క్షణాల్లో వెయ్యికి పైగా ప్రాణాలను తీసేసింది. శనివారం మొరాకోలో సంభవించిన భారీ భూకంపం గత 120 సంవత్సరాలలోనే అత్యంత తీవ్రమైన భూకంపం.
Morocco quake: మొరాకో భూకంప మరణాల సంఖ్య వెయ్యి దాటింది. దాదాపు 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి పేక మేడల్లా భవనాలు కుప్పకూలాయి. ఆ శిధిలాల కింద వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శనివారం రాత్రి వరకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భూకంపం కారణంగా 1037 మంది ప్రాణాలు కోల్పోయారు. 1204 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 721 మంది పరిస్థితి విషమంగా ఉంది.
మరాకేశ్ లో విధ్వంసం
మొరాకోలోని చరిత్రాత్మక నగరం మరాకేశ్ ఈ భూకంపం ధాటికి దారుణంగా ధ్వంసమైంది. ఎక్కువ మరణాలు అక్కడే సంభవించాయి. కుప్పకూలిన భవనాల శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. శిధిలాల తొలగింపు, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం వంటి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. మరాకేశ్ కు 72 కిలోమీటర్ల దూరంలోని పర్వత ప్రాంతాల్లో భూకంప కేంద్రం ఉంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.11 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దాంతో, నిద్రలో ఉన్న చాలా మంది తెలియకుండానే ప్రాణాలు కోల్పోయారు. రబత్, కాసాబ్లాంకా, ఎస్సౌరియా పట్టణాల్లో కూడా భూ కంపనాలు సంభవించాయి.
సోషల్ మీడియాలో..
భూకంపం అనంతర భయానక దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, భూకంపం కారణంగా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లడంతో.. మొరాకోకు సహాయం అందించడానికి ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. చివరకు మొరాకో తో రెండేళ్ల క్రితం అన్ని సంబంధాలను తెంచేసుకున్న అల్జీరియా కూడా సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. మొరాకోను అన్ని రకాలుగా ఆదుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని భారత ప్రధాని మోదీ తెలిపారు.