Morocco earthquake : మొరాకోలో భారీ భూకంపం.. 296మంది మృతి!
Morocco earthquake : మొరాకో దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 296మంది ప్రాణాలు కోల్పోయారు.
Morocco earthquake today : మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:11 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. ఈ ఘటనలో 296మంది మరణించారు. 150 మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మొరాకోలో భూకంపం ధాటికి భవనాలు కదిలిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
"నైరుతి మర్రాకేశ్ ప్రాంతంలో భూమికి 18.5కిమీల దిగువన.. శుక్రవారం రాత్రి 11:11 గంటలకు 6.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. అనేక సెకన్ల పాటు భూమి కంపించింది," అని అమెరికా జియోలాజికల్ సర్వే ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. మొరాకోకు చెందిన నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ అండ్ అలర్ట్ నెట్వర్కం మాత్రం.. ఈ భూకంపం తీవ్రత 7గా ఉందని చెబుతోంది.
Morocco earthquake death toll : మొరాకో భూకంపం సంభవించిన ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడి భవనాలకు.. భూ ప్రకంపనలను తట్టుకునే సామర్థ్యం లేదని తెలుస్తోంది. తాజా ప్రకృతి విపత్తుతో అనేక భవనాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. కొన్ని భవనాలు కుప్పకూలిన దృశ్యాలు ట్విట్టర్లో వెలుగులోకి వచ్చాయి. అయితే.. వాటిని ధ్రువీకరించాల్సి ఉంది.
మొరాకోలో భూకంపాలు ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. ఆఫ్రికన్- యూరేషియన్ ప్లేట్స్ మధ్య ఉండటంతో.. ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
Morocco earthquake 2023 : 2004లో ఈశాన్య మొరాకోలోని హొసిమాలో సంభవించిన భూకంపం ధాటికి.. 628మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000మంది గాయపడ్డారు. ఇక 1980లో ఎల్ అస్నన్ ప్రాంతంలో 7.3 తీవ్రతతో నమోదైన భూకంపం ధాటికి 2500మంది ప్రాణాలు వీడారు. కనీసం 3లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
సంబంధిత కథనం