Rains in India : అల్లకల్లోలంగా ముంబై.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు- జనజీవనం అస్తవ్యస్తం
IMD rain alert : ముంబై సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
జూన్‌లో నైరుతి రుతుపవనాల ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. కానీ జులై మొదటివారం నుంచి దేశవ్యాప్తంగా విపరీతంగా వానలు పడుతున్నాయి. ముంబై సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. అయోధ్యలో సరయూ నది నీటి మట్టం పెరిగింది. కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అటు అసోంలో మళ్లీ వరదలు అల్లాడిస్తున్నాయి.
కర్ణాటక, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జూలై 9న రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ముంబైలో భారీ వర్షాలు..
ముంబైలో సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయం కావడం, ట్రాఫిక్ జామ్ కావడం, లోకల్ ట్రైన్ సర్వీసులు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వార్తలకెక్కింది. వర్షాలు ఈ వారం మొత్తం కొనసాగే అవకాశం ఉంది. ముంబై, థానే, నవీ ముంబై, పన్వేల్, పుణె, రత్నగిరి-సింధుదుర్గ్‌లోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మూసివేయడం జరిగింది.
ముంబైతో పాటు పాల్ఘర్, థానే, ధూలే, నందూర్బార్, జల్గావ్, నాసిక్, అహ్మద్‌నగర్, కొల్హాపూర్, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగాబాద్, జల్నా, పర్భానీ, బీడ్, హింగోలి, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్, అకోలా, అమరావతి, భండారా, బుల్ధానా, చంద్రపూర్, గడ్చిరోలి, గోండియా, నాగ్పూర్, వార్ధా, వాషిమ్, యావత్మాల్లలో జూలై 1 వరకు భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
అయోధ్యలో పెరిగిన సరయూ నది నీటిమట్టం..
అయోధ్యలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయోధ్యలోని సరయూ నది నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరువైంది. రామ్ లల్లాను చూడటానికి, సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యను సందర్శిస్తారు. వర్షాల కారణంగా పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. పైగా రామ మందిరానికి వెళ్లే ప్రధాన రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.
"కొండలు, మైదానాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నీటిమట్టం పెరుగుతోంది. బ్యారేజీ నుంచి కూడా భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. నదిలోకి వెళ్లొద్దని ప్రజలను కోరాం,' అని కేంద్ర జల సంఘం (అయోధ్య) జూనియర్ ఇంజనీర్ అమన్ చౌదరి తెలిపారు.
అసోంలో వరదలకు 70 మందికి పైగా మృతి..
అసోంలో వరదలు బీభిత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో మరో ఆరుగురు మృతి చెందారు. గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. ఫలితంగా వరదలకు ఇప్పటికే 72మంది మరణించారు.
ఆదివారం రాష్ట్రంలో వరద పరిస్థితి కొన్ని జిల్లాల్లో ఇంకా క్లిష్టంగానే ఉంది. ఇంకా 28 జిల్లాల్లో 22.74 లక్షల మంది వరద ప్రభావానికి గురవుతున్నారు. 3.69 లక్షల మందికి పైగా 630 సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందారని, 26 జిల్లాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
కర్ణాటకలో రెడ్ అలర్ట్..
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం మంగళవారం 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. మంగళవారం (జులై 9) స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
మంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంగళూరులోని పాఠశాలలు, కళాశాలలకు తాలూకా యంత్రాంగం సెలవు ప్రకటించింది.
సంబంధిత కథనం