Supreme Court : కోల్‌కతా వైద్యురాలి పేరు, ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించండి-kolkata doctor rape murder case remove rg kar hospital doctor name and photos from social media orders supreme court ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court : కోల్‌కతా వైద్యురాలి పేరు, ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించండి

Supreme Court : కోల్‌కతా వైద్యురాలి పేరు, ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించండి

Anand Sai HT Telugu
Aug 21, 2024 10:14 AM IST

Kolkata Doctor Rape Case : అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుండి తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బాధితురాలి ఐడెంటీ బయటపెట్టే ఎలాంటి పోస్టులు చేయకూడదని చెప్పింది.

భారత సుప్రీం కోర్టు
భారత సుప్రీం కోర్టు (HT_PRINT)

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కోల్‌కతా కేసుపై విచారణ చేసింది. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

'సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత వ్యక్తి గుర్తింపు, మృతదేహం ఛాయాచిత్రాలను ప్రచురించాయి. అందుకే కోర్టు నిషేధాజ్ఞను జారీ చేయవలసి ఉంది. అని అన్ని సామాజిక, ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి బాధితురాలి ఫొటోలు, పేరు' తొలగించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.

ట్రైనీ డాక్టర్ గుర్తింపును సోషల్ మీడియాలో బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది కిన్నోరి ఘోష్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. బాధితురాలి పేరు, సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ సహా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా వ్యాపించాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరణించినవారి పేరు సోషల్ మీడియాలో ప్రచురించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 'ఛాయాచిత్రాలు, వీడియో క్లిప్‌లు మీడియా అంతటా ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకరమైనది.' అని కోర్టు అభిప్రాయపడింది.

2018లో నిపున్ సక్సేనా కేసు తీర్పులో అత్యున్నత న్యాయస్థానం ఇలా ఆదేశించింది. 'ఎవరూ బాధితురాలి పేరును ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో ముద్రించకూడదు, ప్రచురించకూడదు. వారి వాస్తవాలను బహిర్గతం చేయకూడదు.' అని సుప్రీం కోర్టు ఆదేశించింది.

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం, హత్య ఘటనలో ప్రమేయం ఉన్నందున ఆ మరుసటి రోజు కోల్‌కతా పోలీసులు సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ని అరెస్టు చేశారు. ప్రస్తుతం సీబీఐ అతడిని ప్రశ్నిస్తుంది. పాలిగ్రాఫ్ పరీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది.