Covid-19: కేరళలో కొత్తగా 265 కొరోనా కేసులు; దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 80 శాతం కేరళలోనే..
Covid-19: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో శుక్రవారం 640 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 2,669 నుండి 2,997 కి పెరిగింది.
Covid-19: కేరళలో గురువారం ఉదయం నుంచి 24 గంటల వ్యవధిలో 265 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక వ్యక్తి కోవిడ్ 19 తో మరణించారు. గత మూడేళ్లలో కేరళ రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ సంబంధిత మరణాలు 72,060 గా నమోదయ్యాయి.
80% కేరళలోనే..
భారత్ లో ప్రస్తుతం ఉన్న మొత్తం కొరోనా యాక్టివ్ కేసుల్లో 80% ఒక్క కేరళలోనే నమోదు కావడం గమనార్హం. కేరళలో గురువారం ఉదయం నుంచి 24 గంటల వ్యవధిలో 275 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం రికవరీల సంఖ్య 68,37,689 కి పెరిగింది. అంతకుముందు, 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 300 కొత్త కోవిడ్-19 (Covid-19) కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో కొరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణాజార్జి వైద్య శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ 19ను ఎదుర్కొనే విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలని, కొవిడ్ ప్రొటోకాల్ అందరూ పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న తిరువనంతపురం, ఎర్నాకులం జిల్లాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు.
24 గంటల్లో 640 కొత్త కేసులు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో శుక్రవారం 640 కొత్త కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దాంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,669 నుండి 2,997 కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడినవారి సంఖ్య 4.50 కోట్లకు పైగా ఉంది. అలాగే, కోవిడ్ 19 తో మరణించిన వారి సంఖ్య 5,33,328కి చేరుకుంది. అలాగే, రికవరీల సంఖ్య 4,44,70,887కి పెరిగింది. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 98.81% గా ఉంది. మరణాల రేటు 1.19% వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జేఎన్ 1 కేసులు
భారతదేశంలో ఇప్పటివరకు JN.1 సబ్-వేరియంట్ కు సంబంధించి 26 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో గోవాలో 19, రాజస్థాన్‌లో 4, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి. బీఏ 2.86 కు సబ్ వేరియంట్ గా ఈ జేఎన్ 1ను మొదట, ఈ సెప్టెంబర్ నెలలో అమెరికాలో గుర్తించారు. భారత్ లో ఈ వేరయంట్ కు సంబంధించిన తొలి కేసు డిసెంబర్ 8 న గుర్తించారు.