Biden - Xi meet: అగ్ర నేతల శిఖరాగ్ర భేటీ; బైడెన్, జిన్ పింగ్ ద్వైపాక్షిక సమావేశం ప్రత్యేకతలు ఇవే..-joe biden and xi jinping to meet ahead of apec summit top 7 things to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Biden - Xi Meet: అగ్ర నేతల శిఖరాగ్ర భేటీ; బైడెన్, జిన్ పింగ్ ద్వైపాక్షిక సమావేశం ప్రత్యేకతలు ఇవే..

Biden - Xi meet: అగ్ర నేతల శిఖరాగ్ర భేటీ; బైడెన్, జిన్ పింగ్ ద్వైపాక్షిక సమావేశం ప్రత్యేకతలు ఇవే..

HT Telugu Desk HT Telugu
Nov 15, 2023 11:08 AM IST

Biden - Xi meet: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ల మధ్య బుధవారం శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. అపెక్ సదస్సు నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది.

చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (AFP)

Biden - Xi meet: అమెరికా, చైనాల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉంటాయి. ఆర్థిక, రాజకీయ, మిలటరీ విబేధాలు ఎప్పటికప్పుడు ఘర్షణల స్థాయికి చేరుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు ప్రచ్ఛన్న యుద్ధం దిశగా వెళ్తున్నాయి.

ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశం

ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల అధినేతలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మధ్య బుధవారం శిఖరాగ్ర భేటీ జరగబోతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఆరేళ్ల తరువాత అమెరికా గడ్డపై అడుగుపెట్టారు. గతంలో, 2017 లో చివరిసారి ఆయన అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇప్పుడు ఆసియా - పసిఫిక్ ఆర్థిక సహకార మండలి (Asia Pacific Economic Cooperation (APEC) సమావేశంలో పాల్గొనడం కోసం జిన్ పింగ్ యూఎస్ వెళ్లారు. 21దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ అపెక్ సదస్సు నేపథ్యంలోనే ఈ అగ్రనేతల మధ్య ప్రత్యేక ద్వైపాక్షిక భేటీ జరుగుతోంది.

భేటీ ఎక్కడ?

ఈ ఇద్దరు నాయకుల మధ్య సమావేశం ఉత్తర కాలిఫోర్నియా తీరంలో, ప్రశాంత వాతావరణంలో ఉన్న ఫిలోలి ఎస్టేట్ (Filoli) లో జరగబోతోంది. 650 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చారిత్రాత్మక ఎస్టేట్ ను 1917 లో నిర్మించారు. ఇది సాన్ ఫ్రాన్సిస్కోకు 25 మైళ్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం అపెక్ సదస్సు సాన్ ఫ్రాన్సిస్కోలో జరుగబోతోంది.

భేటీ ప్రత్యేకతలు

అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన పరిస్థితుల్లో ఈ భేటీ జరుగుతోంది. ఈ భేటీ ద్వారా ఈ ఉద్రిక్తతలు కొంతవరకు సడలే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు గత నవంబర్ లో, ఇండోనేసియాలోని బాలిలో, జీ 20 సదస్సు నేపథ్యంలో సమావేశమయ్యారు. ఆ తరువాత, వీరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ చోటు చేసుకోలేదు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం, మిలటరీ స్థాయి చర్చలను పున: ప్రారంభించడం, ద్వైపాక్షిక సహాయం అవసరమయ్యే అంశాల నిర్ధారణ.. తదితర అంశాలు చర్చకు రావచ్చు.

వీటిపై చర్చలు

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం, తైవాన్ అంశం, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనం.. తదితర అంశాలు కూడా వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య భేటీ విజయవంతం అయితే, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

Whats_app_banner