monkeypox : ‘రింగ్​ వ్యాక్సినేషన్​’తో మంకీపాక్స్​కు చెక్​..!-india may opt for ring vaccination to combat monkeypox ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monkeypox : ‘రింగ్​ వ్యాక్సినేషన్​’తో మంకీపాక్స్​కు చెక్​..!

monkeypox : ‘రింగ్​ వ్యాక్సినేషన్​’తో మంకీపాక్స్​కు చెక్​..!

Sharath Chitturi HT Telugu
Aug 09, 2022 07:14 AM IST

Monkeypox ring vaccination : రింగ్​ వ్యాక్సినేషన్​తో మంకీపాక్స్​కు చెక్​ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది! రోగికి సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే టీకాలు ఇవ్వడాన్ని రింగ్​ వ్యాక్సినేషన్​ అంటారు.

<p>‘రింగ్​ వ్యాక్సినేషన్​’తో మంకీపాక్స్​కు చెక్​..!</p>
‘రింగ్​ వ్యాక్సినేషన్​’తో మంకీపాక్స్​కు చెక్​..! (AP)

Monkeypox ring vaccination : దేశాన్ని మంకీపాక్స్​ భయపెడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 మంకీపాక్స్​ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మంకీపాక్స్​కు చెక్​ పెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే కొవిడ్​లాగ.. మంకీపాక్స్​కు మూకుమ్మడి టీకాల పంపిణీ జరగకపోవచ్చు. మంకీపాక్స్​పై కేంద్రం 'రింగ్​ వ్యాక్సినేషన్​' అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంది!

ఏంటి ఈ రింగ్​ వ్యాక్సినేషన్​?

వైరస్​​ బారిన పడిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన వారికి టీకాలు ఇవ్వడాన్నే రింగ్​ వ్యాక్సినేషన్​ అంటారు. ఇది అమెరికాలో ఇప్పటికే అమల్లో ఉంది.

"ఎవరైన మంకీపాక్స్​ బారిన పడితే.. వారికి సన్నిహితంగా ఉండేవారిని వ్యాక్సినేట్​ చేయడమే ఈ రింగ్​ వ్యాక్సినేషన్​. మంకీపాక్స్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు," అని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

Monkeypox : ఇప్పటివరకు కేవలం 9 కేసులే వెలుగు చూడటంతో.. భారీ జనాభాకు టీకాలు అందించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. టీకాలను అభివృద్ధి చేసేందుకు ఫార్మా కంపెనీలను ఆహ్వానించింది. అయితే.. ఇది మొత్తం జనాభాకి కాకపోవడంతో టీకాలు తయారు చేయాలా? వద్దా? అన్నది ప్రైవేటు సంస్థల ఇష్టమని ఐసీఎంఆర్​ పేర్కొంది. కానీ.. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాలను కొనేందుకు ప్రభుత్వం సిద్ధపడొచ్చని సమాచారం.

మంకీపాక్స్​ చికిత్స కోసం టికోవిరిమాట్​ అనే డ్రగ్​ను అనుమతిచ్చింది యూఎస్​ ఎఫ్​డీఏ. అయితే.. ఈ మంకీపాక్స్​కి ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం లేదని, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ.

దేశంలో ‘కొత్త రకం’ మంకీపాక్స్​..!

కొవిడ్​లాగే.. మంకీపాక్స్​కు సైతం కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి! ఇండియాలోనే మంకీపాక్స్​కు సంబంధించి.. కొత్త వేరియంట్​ను గుర్తించినట్టు వైద్యులు చెబుతున్నారు. యూరోప్​ను గడగడలాడిస్తున్న మంకీపాక్స్​కు, దీనికి చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు.

Monkeypox symptoms in telugu : తొలి రెండు కేసులకు సంబంధించిన నమూనాలపై జినోమ్​ సీక్వెన్సింగ్​ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన నివేదిక ఇటీవలే బయటకొచ్చింది. ఈ రెండు కేసుల్లో ఉన్నది మంకీపాక్స్​ ఏ.2 స్ట్రెయిన్​ అని తెలుస్తున్నట్టు సీఎస్​ఐఆర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ జినోమిక్స్​ అండ్​ ఇంటిగ్రేటివ్​ బయోలాజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యూరోప్​లో ప్రస్తుతం మంకీపాక్స్​ బీ.1 వేరియంట్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. అయితే.. ఇండియాలో ఉన్న మంకీపాక్స్​ ఏ.2 వేరియంట్​ ఇప్పటికే అమెరికా, థాయ్​లాండ్​లోనూ గుర్తించినట్టు తెలుస్తోంది.

అయితే.. ఈ రెండు వేరియంట్లలో ఏది అత్యంత ప్రమాదకరం? ఏది ఎక్కువగా వ్యాపిస్తుంది? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు.

వైరస్​లు అన్నవి కాలంతో పాటు పరిణామం చెందుతాయని, అందుకే కొత్త వేరియంట్లు వస్తుంటాయని ఐసీఎంఆర్​కు చెందిన నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ డైరక్టర్​ డా. ప్రియా అబ్రహం వెల్లడించారు. అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్