భారత్-చైనా సంబంధాలు సరిగా లేవు.. మరో దేశం జోక్యం అవసరం లేదు-india china relationship is not good and not looking for other countries in this issue says s jaishankar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత్-చైనా సంబంధాలు సరిగా లేవు.. మరో దేశం జోక్యం అవసరం లేదు

భారత్-చైనా సంబంధాలు సరిగా లేవు.. మరో దేశం జోక్యం అవసరం లేదు

Anand Sai HT Telugu
Jul 29, 2024 08:08 PM IST

India-China Relation : భారత్-చైనా సంబంధాలు క్షీణించాయన్న మాట నిజమేనని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. సరిహద్దు వివాదంలో మూడో దేశం జోక్యం చేసుకునే అవకాశాన్ని తోసిపుచ్చారు.

ఎస్ జైశంకర్
ఎస్ జైశంకర్

చైనాతో భారత్ సరిహద్దు వివాదంలో మూడో పక్షం లేదా వేరే దేశం జోక్యం చేసుకునే అవకాశాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ తోసిపుచ్చారు. ఈ సమస్య 2 పొరుగు దేశాల మధ్య ఉంది. దీనిని భారత్, చైనాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చైనా, భారత్ వంటి పొరుగు దేశాల మధ్య సమస్య ఉన్న మాట వాస్తవమేనని చెప్పిన ఆయన.. దాన్ని పరిష్కరించడానికి మనం ఒక మార్గాన్ని కనుగొనాలి అన్నారు.

టోక్యోలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. భారత్, చైనాల మధ్య ఉన్న అసలు సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ఇతర దేశాల జోక్యాన్ని కోరుకోవడం లేదని అన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు టోక్యో వచ్చిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాతో భారత్ సంబంధాలు సరిగా లేవని, అది సరిగా పనిచేయడం లేదని అన్నారు. సహజంగానే ప్రపంచంలోని ఇతర దేశాలు ఈ విషయంలో ఆసక్తి చూపుతాయని, ఎందుకంటే రెండు గొప్ప దేశాలని, మన సంబంధాల స్థితి మిగతా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.

భారత్, చైనాల మధ్య సంబంధాలు సరిగా లేవు, సాధారణమైనవి కావు అని విదేశాంగ మంత్రి జైశంకర్ ఉద్ఘాటించారు. అయితే చైనాతో భారత్ మంచి పొరుగు సంబంధాలను కోరుకుంటుందని ఆయన అన్నారు. 'ప్రస్తుతం చైనాతో సంబంధాలు బాగా లేవు. పొరుగువారిగా మేం మంచి సంబంధాలను ఆశిస్తున్నాం. అయితే వారు ముందుగా సంతకం చేసిన LOC, ఇతర ఒప్పందాలను గౌరవిస్తేనే మా సంబంధం మెరుగుపడుతుంది.' అని జైశంకర్ అన్నారు.

తూర్పు లడఖ్‌లో భారతదేశం, చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తోసిపుచ్చారు. తమ సమస్యలు ద్వైపాక్షికమైనవని పేర్కొన్నారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో సరిహద్దు ఉద్రిక్తతల నుంచి భారత్‌కు చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. ఈ ఉద్రిక్తత కారణంగా ప్రాణనష్టం సంభవించిందన్నారు.

ఇండో-పసిఫిక్‌లో విపత్తు తట్టుకునే శక్తి, డిజిటల్ టెక్నాలజీ, కనెక్టివిటీపై దృష్టి సారించి క్వాడ్ సమ్మిట్‌ను నిర్వహించడంలో భారతదేశం పాత్రను కూడా ఆయన ప్రస్తావించారు. అయితే క్వాడ్ ప్రాంతీయ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని చైనా ఆరోపించింది.

జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘోరమైన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది దశాబ్దాలుగా ఇరుపక్షాల మధ్య తీవ్రమైన సైనిక వివాదానికి దారితీసింది.

Whats_app_banner

టాపిక్