Heavy rainfall alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ ప్రాంతాలకు 'అలర్ట్'
Heavy rainfall alert : ఒడిశా, ఝార్ఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతూ.. యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరోవైపు తెలంగాణలో సైతం అతి భారీ వర్షాలు పడతాయని సూచించింది.
Heavy rainfall alert : గత వారం.. భారీ వర్షాలతో అల్లాడిపోయిన ఉత్తరాఖండ్, ఒడిశా ప్రజలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పిడుగులాంటి వార్తను ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యెల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో.. రాజస్థాన్‌లో వర్షాలు కాస్త శాంతించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మహానది, సురనరేఖ నదుల ఉద్ధృతి వల్ల ఏర్పడిన వరదల నుంచి ఒడిశా ఇంకా కోలుకోలేదు. కాగా.. ఇప్పుడు శనివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మయూర్భంజ్, బాలాసోర్, కియోఝర్, కటక్, జైపూర్, భద్రక్, బౌధ్, నయాగఢ్, ఖుర్ద, రాయగడ, కోరపుట్, మల్కన్‌గిరి, నబరంగ్‌పూర్, గజపతి, గంజమ్, అంగుల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతూ.. యెల్లో అలర్ట్‌ని ఇచ్చింది.
Rains in India : బిహార్‌లో సైతం.. శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఝార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం.. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఈ నెల 30 వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయి. వర్షాలకు ఇప్పటికే.. ఆ రాష్ట్రంలోని 650 గ్రామాలు నీటమునిగాయి.
ఉత్తరాఖండ్‌లో.. మంగళవారం వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. జాతీయ విపత్త నిర్వహణ దళం నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. కొన్ని రోజుల క్రితమే.. ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాలు ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి.
మరోవైపు.. కొన్ని రోజులుగా.. రాజస్థాన్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఝాల్వార్, బుంది, కోటా ప్రాంతాల్లో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కాగా.. రానున్న రోజుల్లో వర్షాల ప్రభావం తగ్గుతుందని ఐఎండీ పేర్కొంది. వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని వివరించింది.
ఈ నెల 30 వరకు.. పశ్చిమ్ బెంగాల్‌లోని హిమాలయ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయి. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లో 5రోజుల పాటు అతి భారీ వర్షాలు పడతాయి.
తెలంగాణలో..
Rains in Telangana : తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో.. రానున్న ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా రానున్న ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది.
సంబంధిత కథనం