IMD alert : ఈ ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్- హిమాచల్‌లో ఆకస్మిక వరదలు!
దేశంలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 2 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ వివరాలు..
దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్య మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, కొంకణ్, గోవా, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, అసోం, మేఘాలయ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది.
ఐఎండీ వాతావరణ సూచన..
1. మహారాష్ట్రలో ముంబై, థానే, పాల్గఢ్లో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్‌లో అతి భారీ వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దీంతో పాటు పుణె, కొల్హాపూర్, సతారాలోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
2. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ, శిమ్లా, కులు జిల్లాల్లో మేఘస్ఫోటనాలు సంభవించాయి. ఫలితంగా సుమారు 50 మంది గల్లంతయ్యారని, రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఆగస్టు 2 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. కంగా జిల్లాలో శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, సిర్మౌర్, సోలన్, మండీ, సిమ్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కూడా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటన ప్రకారం కాంగ్రా, కులు, మండి, శిమ్లా, చంబా, సిర్మౌర్ జిల్లాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది.
3. కొండచరియలు విరిగిపడి ఇప్పటికే 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ జిల్లాలో ఐఎండీ కేరళ శనివారం వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వయనాడ్ సహా కేరళలోని 4 ఉత్తర జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ కేరళ డైరెక్టర్ నీతా కే గోపాల్ తెలిపారు. “దక్షిణాదిన పతనంతిట్ట వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశాం. రేపటి నుంచి వర్షపాతం గణనీయంగా తగ్గనుంది. కాబట్టి కేరళలోని ఉత్తర జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్స్ జారీ అయ్యాయి. ఆదివారం నుంచి తగ్గుముఖం పడుతుందని, ఆ తర్వాత మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి,” అని అన్నారు.
4. ఈ ఉదయం దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆగస్టు 5 వరకు దేశ రాజధానిలో అడపాదడపా వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది.
5. ఇతర రాష్ట్రాల విషయానికొస్తే, ఐఎండీ ప్రకారం, ఆగస్టు 1-5 మధ్య కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 1-4 మధ్య మధ్యప్రదేశ్; ఆగస్టు 1-3 తేదీల్లో విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఆగస్టు 3న సౌరాష్ట్ర, కచ్. దీనికి తోడు ఆగస్టు 3న మరాఠ్వాడా, ఆగస్టు 4న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
6. ఆగస్టు 1 నుంచి 3 వరకు ఉత్తరాఖండ్, ఆగస్టు 1 నుంచి 4 వరకు తూర్పు రాజస్థాన్, ఆగస్టు 1 నుంచి 5 వరకు జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, ఆగస్టు 1 నుంచి 7 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆగస్టు 1 నుంచి 3 వరకు ఉత్తరప్రదేశ్, 6, 7 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 న పంజాబ్ మరియు హరియాణా-చండీగఢ్‌లో వర్షాలు పడతాయి.
7. ఆగస్టు 2న దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్టు 1-4 తేదీల్లో కోస్తా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
8. ఈశాన్య భారతంలోని అసోం, మేఘాలయలో ఆగస్టు 2న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 5 న సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాలకు వర్ష సూచన జారీ అయ్యాయి.
9. ఆగస్టు 2న ఝార్ఖండ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్లో, ఆగస్టు 1-7 తేదీల్లో బీహార్, అసోం, మేఘాలయ, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది.
10. జులైలో భారత్ సగటు కంటే 9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు చేసిందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
సంబంధిత కథనం