Himachal Pradesh Cloudburst : హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్.. వరదల్లో ఒకరు మృతి, 28 మంది గల్లంతు
Himachal Pradesh cloudburst : హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ అయి విపరీతంగా వానలు పడుతున్నాయి. వరదల కారణంగా ఒకరు మృతి చెందగా 28 మంది గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌తోపాటుగా హిమాచల్ ప్రదేశ్‌లోనూ క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. భారీగా నష్టం సంభవిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒకరు మృతి చెందగా 28 మంది గల్లంతయ్యారని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) గాలింపు చర్యలు చేపట్టింది. సిమ్లా జిల్లాలోని రాంపూర్‌లోని సమీజ్ ఖాడ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించి అకస్మాత్తుగా, తీవ్రమైన వరదలు వచ్చాయి. ఈ ఘటనలో మొత్తం 19 మంది గల్లంతయ్యారని సిమ్లా డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ తెలిపారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు, పోలీసులు, హోంగార్డుల బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నామని కశ్యప్ తెలిపారు. జిల్లాలోని పధార్ సబ్ డివిజన్ లోని తల్తుఖోడ్‌లో మరో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఇక్కడ వరదల్లో ఒక మృతదేహాన్ని వెలికితీశామని, తొమ్మిది మంది గల్లంతయ్యారని మండీ డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవగన్ తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వరదల కారణంగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. జిల్లా యంత్రాంగం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా భారీ నష్టం, జనజీవనం అస్తవ్యస్తం అయిన ఘటనపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖుతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదిలావుండగా హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి భయానక దృశ్యాలు బయటకు వస్తున్నాయి. లోయలు, పట్టణాల గుండా నీరు వెళ్తోంది. బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
క్లౌడ్ బరస్ట్ అంటే.. సుమారు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే క్లౌడ్ బరస్ట్ అంటారు అని ఐఎండీ పేర్కొంది. ఇలా వర్షాలు పడటం వలన వరదలు సంభవిస్తాయి.