IIT Indore: విద్యుత్ ను ఉత్పత్తి చేసే షూస్; లొకేషన్ కూడా చెప్తాయి; సాయుధ దళాలకు ప్రత్యేకం..
Shoes that generate electricity: భారత సాయుధ దళాల కోసం ఇండోర్ ఐఐటీ విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక షూలను రూపొందించింది. ఇవి ధరించి నడవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి కావడమే కాకుండా, ఆ సైనికుడు ఉన్న లొకేషన్ ను కూడా తెలుసుకోవచ్చు.
Shoes that generate electricity: సాయుధ దళాల సిబ్బంది భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించే ఆవిష్కరణలో భాగంగా, భారతీయ సైనికుల కోసం ఇండోర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రత్యేక షూలను రూపొందించింది.
సైనిక దళాల కోసం..
ఐఐటీ ఇండోర్ ఇప్పటికే 10 జతల బూట్ల మొదటి బ్యాచ్ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు సరఫరా చేసింది. ఐఐటీ ఇండోర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుహాస్ జోషి మాట్లాడుతూ, ఈ బూట్ల వినూత్న ఫీచర్లు ఆర్మీ సిబ్బంది భద్రత, సమన్వయం, సామర్థ్యాన్ని పెంచుతాయని అన్నారు. ప్రొఫెసర్ ఐఏ పళని మార్గదర్శకత్వంలో ప్రయోగాత్మకగా తయారు చేసిన షూలను ట్రైబో-ఎలక్ట్రిక్ నానో జెనరేటర్ (TENG) టెక్నాలజీతో రూపొందించారని, ఇవి అడుగడుగునా విద్యుత్తును ఉత్పత్తి చేయగలవని అధికారులు తెలిపారు.
జీపీఎస్ తో లొకేషన్ కూడా..
ఆ షూస్ ధరించి వ్యక్తి నడవడం వల్ల జనించిన విద్యుత్తు షూస్ అడుగు భాగంలో అమర్చిన పరికరంలో నిల్వ అవుతుంది. ఆ విద్యుత్తు ఆ సైనికుడి వద్ద ఉన్న చిన్న, చిన్న ఉపకరణాలను ఆపరేట్ చేయడానికి, చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (GPS), రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ కలిగిన ఈ షూలు ఆ సైనికుడు ఉన్న లొకేషన్ ను రియల్ టైమ్ లో గుర్తించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.
సీనియర్ సిటిజన్లకు కూడా..
అల్జీమర్స్ తో బాధపడుతున్న సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పర్వతారోహకుల లొకేషన్ ను ట్రాక్ చేయడానికి టెంగ్ టెక్నాలజీ ఉన్న ఈ షూస్ ను ఉపయోగించవచ్చు. కర్మాగారాల్లో కార్మికుల హాజరును, వారి విధులను పర్యవేక్షించడంలో కూడా ఇవి సహాయపడుతాయి. క్రీడాకారుల కదలికలను కూడా ఈ షూలు కచ్చితంగా విశ్లేషించి వారి పనితీరును మెరుగుపరుస్తాయని అధికారులు తెలిపారు.