అస్సాం రాజధాని గువాహటి లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో పీజీ చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని శుక్రవారం ఉదయం హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఇన్ స్టిట్యూట్ అధికారులు తెలిపారు. మృతురాలు ఉత్తరప్రదేశ్ చెందిన విద్యార్థిని అని, ఐఐటీ గువాహటిలో ఎంటెక్ చదువుతోందని వెల్లడించారు. ఈ ఘటనపై హాస్టల్ లోని ఇతర విద్యార్థినులు తమకు సమాచారం అందించారని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు వచ్చి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారని వెల్లడించారు.
ప్రాథమికంగా ఇది ఆత్మహత్య కేసుగా అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ ఘటన గురించి ఐఐటీ గువాహటి అధికారులు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘2024 ఆగస్టు 9 న క్యాంపస్ లో ఒక విద్యార్థిని దుర్మరణం చెందారు. ఇది చాలా విచారకరం. దీనిపై పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. ఈ క్లిష్ట సమయంలో ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులకు ఇన్ స్టిట్యూట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది’’ అని ఐఐటీ గువాహటి అధికారులు ఆ ప్రకటనలో వివరించారు.