Hathras road accident : ఘోర రోడ్డు ప్రమాదం- టెంపోను ఢీకొట్టిన బస్సు.. 15మంది దుర్మరణం
UP road accident : హత్రాస్ రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హత్రాస్‌లోని ఆగ్రా-అలీగఢ్, జాతీయ రహదారి 93పై శుక్రవారం బస్సు వాహనాన్ని ఓ టెంపో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు, నలుగురు పిల్లలు సహా 15 మంది మరణించినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు ధృవీకరించారు.
సెప్టెంబర్ 6న అలీగఢ్ వెళ్తున్న బస్సు టెంపో లోడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం హత్రాస్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
“ఇప్పటి వరకు మరణించిన వారిలో ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు సహా 15 మంది ఉన్నారు. బస్సు, మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది,” అని అలీగఢ్ కమిషనర్ చైత్ర వీ తెలిపారు. క్షతగాత్రుల్లో 11 మంది స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో 8 మందిని చికిత్స నిమిత్తం అలీగఢ్‌కు తరలించామని తెలిపారు.
హత్రాస్ రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు.
“ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలుగా సాయం చేస్తోంది,” అని మోదీని ఉటంకిస్తూ పీఎంఐ ట్వీట్ చేసింది.
హత్రాస్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని మంజూరు చేయనున్నారు.
హత్రాస్ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన బాధితులకు సరైన వైద్యం అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.
హత్రాస్ రోడ్డు ప్రమాదం ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్పందించారు.
ఘోర రోడ్డు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారనే వార్త చాలా బాధాకరమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
“మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను,” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ నేత రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'యూపీ హత్రాస్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందారన్న వార్త చాలా బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను," అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ట్వీట్ చేశారు.