Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన నిందితులకు రాజకీయ పార్టీలతో లింకులు
Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నట్టుగా విచారణలో తేలింది.
హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 121మంది వరకూ మరణించారు. ఈ కేసులో పోలీసులు చాలా సీరియస్‌గా విచారణ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో కీలక నిందితుడు మధుకర్‌ను అరెస్టు చేశారు. మధుకర్‌తో పాటు మరో ఇద్దరు రామ్ ప్రకాష్ షాక్యా, సంజూ యాదవ్‌లను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ విరాళాలు సేకరించి.. సరైన చర్యలు పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన బోధకుడు సూరజ్ పాల్‌కు అత్యంత సన్నిహితులలో మధుకర్ ఒకడు. పట్టణాలు, గ్రామాలలో భోలే బాబాకు జనాలు మద్దతు ఇచ్చేందుకు చురుకుగా పనిచేశాడు.
42 ఏళ్ల మధుకర్‌ను శుక్రవారం రాత్రి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో అరెస్టు చేశారు. మధుకర్‌తో పాటు మరో ఇద్దరు రామ్ ప్రకాష్ షాక్యా, సంజూ యాదవ్‌లను శనివారం అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఇద్దరు మహిళలు కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. హత్రాస్ తొక్కిసలాట కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
భోలే బాబాకు నిధుల విషయంలో మధుకర్ రాజకీయ పార్టీతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 'నిందితుడైన దేవ్ ప్రకాష్ మధుకర్‌కు సత్సంగం నిర్వహించే సంస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. నిధుల సేకరణలో నిమగ్నమై ఉన్నాడు. మధుకర్ కొన్ని రాజకీయ పార్టీలను సంప్రదించినట్లు విచారణలో వెల్లడైంది.' అని పోలీసు సూపరింటెండెంట్ (SP), హత్రాస్, నిపున్ అగర్వాల్ తెలిపారు.
శనివారం పోలీసులు మధుకర్‌ను హత్రాస్‌లోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు ఎస్పీ తెలిపారు. అతని ఆర్థిక లావాదేవీలు, మనీ ట్రయల్స్ పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కాల్ లిస్ట్ కూడా చూస్తామని చెప్పుకొచ్చారు. అటువంటి కార్యక్రమాలు, ఇతర వనరులను ఏదైనా రాజకీయ పార్టీ నిధులు సమకూరుస్తుందో లేదో తెలుసుకోవడానికి నిధుల సేకరణకు సంబంధించి వివరణాత్మక దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.
ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఒక రాజకీయ పార్టీ తన రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారితో అనుసంధానించబడినట్లు కనిపిస్తోందని ఎస్పీ వెల్లడించారు. మధుకర్ 78 మంది సంపన్న వ్యక్తులతో ఉన్న కమిటీకి నాయకత్వం వహించే ముఖ్య వాలంటీర్‌గా ఉన్నాడు. మొత్తం నగదు వివరాలను చూసుకుంటున్నాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ మధుకర్ అనే వ్యక్తి 2010 నుండి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లాలోని శీతల్‌పూర్ బ్లాక్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కోసం టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. తన అత్తమామల ద్వారా భోలే బాబాను కలిశాడని స్థానికులు చెబుతున్నారు.
మధుకర్ తన MGNREGA ఉద్యోగంలో నెలకు రూ.11,000 సంపాదించేవాడు. కానీ భోలే బాబా నమ్మకస్తుడిగా అయ్యాక.. అతని సంపాదన విపరీతంగా పెరిగింది. పేదలను భోలే బాబా సమావేశాలకు ఎక్కువగా తీసుకెళ్లేవాడు. గ్రామీణ వర్గాలతో కనెక్ట్ అయ్యే మధుకర్ సామర్థ్యం బాబాకు బాగా నచ్చింది. దీంతో తన దగ్గరే పెట్టుకున్నాడు. భోలే బాబాకు ముఖ్య అనుసంధానకర్తగా మధుకర్ స్థానాన్ని సంపాదించాడు.