Bhole Baba On Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాట ఘటనపై మెుదటిసారి స్పందించిన భోలే బాబా-bhole baba first reaction on hathras stampede death toll rises to 121 in satsang incident ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bhole Baba On Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాట ఘటనపై మెుదటిసారి స్పందించిన భోలే బాబా

Bhole Baba On Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాట ఘటనపై మెుదటిసారి స్పందించిన భోలే బాబా

Anand Sai HT Telugu
Jul 04, 2024 06:24 AM IST

Hathras Stampede : హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలే బాబా మొదటిసారి స్పందించారు. ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.

భోలే బాబా లాకెట్
భోలే బాబా లాకెట్

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది వరకూ మరణించారు. భోలే బాబా నిర్వహించిన సత్సంగ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే భోలే బాబా ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే హత్రాస్ తొక్కిసలాట ఘటనపై ఆయన మెుదటిసారి స్పందించారు. సత్సంగ్ వేదిక నుండి బయలుదేరిన తర్వాత గందరగోళం చెలరేగిందని ఒక ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాట జరగడానికి సామాజిక వ్యతిరేక అంశాలు కూడా కారణమని ఆరోపించారు.

భోలే బాబా ఏం చెప్పారు

భోలే బాబా తన లిఖితపూర్వక ప్రకటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట జరగకముందే తాను సభ నుంచి వెళ్లిపోయానని స్పష్టం చేశారు.

సత్సంగ్ తరువాత జరిగిన సంఘటనలకు బాధ్యులైన దుర్మార్గులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది AP సింగ్‌ను తన న్యాయవాదిగా నియమించినట్లు భోలే బాబా చెప్పారు.

ఈ ఘటన తర్వాత భోలే బాబాపై విచారణను ముమ్మరం చేశారు. దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. భోలే బాబా కార్యకలాపాలు, అతని ఆశ్రమం, నిధుల వనరులు, అతని సహచరుల గురించి సమాచారాన్ని సేకరించేందుకు మెయిన్‌పురి, ఎటా, కస్గంజ్, అలీఘర్, హత్రాస్, మథుర, ఫిరోజాబాద్, ఇటావా, ఆగ్రాలకు చెందిన సీనియర్ పోలీసు అధికారులు తమ జిల్లాల్లోని భక్తులతో మాట్లాడే పనిలో ఉన్నారు.

ఎఫ్ఐఆర్‌లో లేని పేరు

మరోవైపు ఎఫ్ఐఆర్ విషయంపై అధికారులపై విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ పోలీసులు హత్రాస్‌లోని మతపరమైన సభ నిర్వాహకులపై నమోదు చేశారు. అయితే భోలే బాబాను నిందితుడిగా మాత్రం పేర్కొనలేదు. సికందరరావు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిర్వాహకుడు దేవప్రకాష్ మధుకర్, ఇతర నిర్వాహకుల పేర్లు ఉన్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అందులో భోలే బాబా పేరును చేర్చలేదని విమర్శలు వస్తున్నాయి.

అనుమతికి మించి

80,000 మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం.., సత్సంగ్ వేదిక వద్ద సుమారు 2,50,000 మంది భక్తులు గుమిగూడారు. దీనితో భోలే బాబా వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగింది. బాబా పాద ధూళి తీసుకునేందుకు జనాలు ఎగబడ్డారని కొందరు చెబుతున్నారు. తొక్కిసలాటలో మరణించిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, వృద్ధులు, మహిళలు ఉన్నారు.

క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి అందుబాటులో ఉన్న వనరులను అధికారులు ప్రయత్నించారు. అయితే నిర్వాహకులు సహకరించలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Whats_app_banner