Sabarimala Ayyappa : శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు అప్డేట్.. వర్చువల్ క్యూ 70 వేలకు పరిమితం-good news to sabarimala ayyappa devotees and 70 thousand online slots open details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sabarimala Ayyappa : శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు అప్డేట్.. వర్చువల్ క్యూ 70 వేలకు పరిమితం

Sabarimala Ayyappa : శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు అప్డేట్.. వర్చువల్ క్యూ 70 వేలకు పరిమితం

Anand Sai HT Telugu
Oct 17, 2024 10:19 AM IST

Sabarimala Ayyappa Darshan : శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఏపీ, తెలంగాణతోపాటుగా ఇతర రాష్ట్రాల భక్తులు భారీగా కేరళకు వెళ్తారు. అయితే యాత్రికుల కోసం కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

శబరిమల భక్తులు
శబరిమల భక్తులు (PTI)

వచ్చె నెలలో మండల మకర విళక్కు(మకర జ్యోతి) పూజల సీజన్ మెుదలకానుంది. శబరిమల ఆలయంలో రాబోయే తీర్థయాత్ర సీజన్ కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం వర్చువల్ క్యూ బుకింగ్‌లను ప్రారంభించింది. దీనితో రోజుకు 70,000 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోనున్నారు. నిజానికి ముందుగా 80 వేల మంది అని కేరళ సర్కార్ నిర్ణయించగా.. తర్వాత 10,000 తగ్గించింది. మిగిలిన పది వేల స్లాట్‌లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని మరోవైపు దేవస్థానం చెప్పింది.

అయితే మెుదట ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి చేసిన కేరళ సర్కార్ తర్వాత వెనక్కు తగ్గింది. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోని భక్తులకు కూడా దర్శనం కల్పించనున్నారు. వర్చువల్ క్యూ మాత్రమే అమలు చేసి, ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారికి 48 గంటల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అయితే స్పాట్‌బుకింగ్‌పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారికే దర్శనం అని చెప్పగా.. భక్తులు, విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గి.. బుకింగ్ చేసుకోని వారికి కూడా దర్శనం అని చెప్పింది. ఆన్‌లైన్ బుకింగ్ లేకుండా వచ్చినవారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని అసెంబ్లీలో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా శబరిమల దర్శనం చేసుకునేవారికి కూడా సాఫీగా దర్శనం కల్పిస్తామని తెలిపారు. గతేడాది కూడా భక్తుల కోసం ఆన్‌లైన్‌లో 70 వేల బుకింగ్‌లు కేటాయించారు.

స్పాట్ బుకింగ్‌లను అనుమతించకూడదనే నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ హిందూ సంస్థలు కూడా అభ్యంతరం చెప్పడంతో ప్రభుత్వం యూ టర్న్ వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఉపయోగించుకుంటుందని సీపీఐ మండిపడింది.

మరోవైపు వర్చువల్ బుకింగ్ కోసం కఠినమైన ఆదేశం ఉన్నప్పటికీ, ముందస్తు నమోదు లేకుండా నిర్దిష్ట సంఖ్యలో యాత్రికులు వస్తారని బోర్డు అంచనా వేస్తుందని ట్రావెన్‌కోర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంకోవైపు పోలీసులతో సహా వివిధ శాఖలతో వరుస సంప్రదింపుల తర్వాత యాత్రికుల సంఖ్యను పరిమితం చేస్తూ ప్రభుత్వం ముందస్తు నిర్ణయం తీసుకుంది.

'వాస్తవానికి రోజుకు 70,000 మందికి పరిమితం చేయాలనేది పోలీసుల సిఫార్సు. వీలైనంత ఎక్కువ మంది భక్తులకు సహాయం చేసేందుకు ట్రావెన్‌కోర్ బోర్డు ఆలోచిస్తుంది.' అని TDB ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ చెప్పారు.

శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయి. తర్వాత తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కొనసాగుతాయి. అయ్యప్పస్వామి మండల పూజా మహోత్సవాలు నవంబర్ 15న ప్రారంభమై డిసెంబర్ 26 వరకు ఉంటాయి. రెండు రోజులు ఆలయాన్ని మూసి వేసిన తర్వాత డిసెంబర్ 30 నుంచి మకర విళక్కు పూజల కోసం తెరవనున్నారు. జనవరి 14న మకర సంక్రాంత్రి రోజు మకర జ్యోతి దర్శనం, 20వ తేదీన పడిపూజతో సీజన్ ముగుస్తుంది.

Whats_app_banner