AAP in Karnataka elections : కర్ణాటక ఎన్నికల బరిలో ఆప్.. అన్ని సీట్లల్లో పోటీ!
AAP in Karnataka elections : 2023 కర్ణాటక ఎన్నికలపై కన్నేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. మొత్తం 224 సీట్లల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించింది.
AAP in Karnataka elections : పంజాబ్ ఎన్నికల గెలుపుతో జాతీయ రాజకీయాలపై కన్నేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జోరు పెంచింది. ఓవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కోసం తీవ్రస్థాయిలో ప్రచారాలు చేస్తూనే.. మరోవైపు రానున్న కర్ణాటక ఎన్నికలపైనా పక్కాగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో.. రానున్న కర్ణాటక ఎన్నికల్లో మొత్తం 224 సీట్లల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది ఆప్.
అభ్యర్థుల జాబితా కూడా రెడీ..!
2023 మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది. ఇందుకు తగ్గట్టుగానే ఆప్ కూడా తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే.. సగానిపైగా అభ్యర్థుల జాబితాను ఆప్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. 2023 జనవరి మొదటి వారంలోనే ఈ జాబితాను ప్రకటించి, ఇతర పార్టీలను ఆశ్చర్యానికి గురిచేయాలని చూస్తోంది అరవింద్ కేజ్రీవాల్ బృందం. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఎన్నికలకు ముందు ప్రకటించే విధంగా కసరత్తులు చేస్తోంది.
2023 Karnataka Assembly elections : 224 స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని.. కర్ణాటక ఆప్ కన్వీనర్ పృథ్వి రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వంలోని అవినీతిని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళతామని స్పష్టం చేశారు.
"మొత్తం 224 సీట్లల్లో పోటీ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. 170కిపైగా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాలు మొదలుపెట్టేశాము. గ్రామ్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. బూత్ లెవెల్లో ఆప్ సభ్యులను కేటాయించే పనిలో ఉన్నాము," అని పృథ్వి రెడ్డి స్పష్టం చేశారు.
Karnataka AAP : "బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తేనే అవినీతి, అధికార దుర్వినియోగంపై పోరాడగలము అని మేము అనుకుంటున్నాము. అందుకే రాష్ట్రంలోని ప్రతి బూత్‌కు కనీసం 10మంది కార్యకర్తలను కేటాయిస్తాము. ప్రజల సమస్యలను వారు లేవనెత్తుతారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు. అందుకే ఆప్‌కు కర్ణాటకలో ఆదరణ లభిస్తోంది," అని పృథ్వి రెడ్డి వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు.. ప్రజల సమస్యలను తీర్చడంలో విఫలమయ్యాయని పృథ్వి రెడ్డి ఆరోపించారు. గెలవడం కోసమే తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో సత్తా చాటుతామని పేర్కొన్నారు.
Karnataka Assembly elections : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఆప్ మెరుగ్గా రాణిస్తే.. కర్ణాటకలోనూ మరింత జోరు పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంట గెలిస్తే.. ఆప్‌నకు, అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాముఖ్యత విపరీతంగా పెరుగుతుంది. ఇది కర్ణాటక ఎన్నికలపైనా ప్రభావం చూపిస్తుందని అనడంలో సందేహం లేదు!
సంబంధిత కథనం