Elon Musk Twitter layoffs : ట్విట్టర్​లో ఉద్యోగాల కోతపై మస్క్​ స్పందన ఇది..-elon musk defends layoffs says twitter losing over usd 4 million a day ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Elon Musk Defends Layoffs, Says Twitter Losing Over Usd 4 Million A Day

Elon Musk Twitter layoffs : ట్విట్టర్​లో ఉద్యోగాల కోతపై మస్క్​ స్పందన ఇది..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 05, 2022 08:19 AM IST

Elon Musk Twitter layoffs : ట్విట్టర్​లో ఉద్యోగాల కోతను ఎలాన్​ మస్క్​ సమర్థించుకున్నారు. కంపెనీకి భారీ నష్టం వాటిల్లుతోందని, ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని అన్నారు.

ట్విట్టర్​లో ఉద్యోగాల కోతను సమర్థించుకున్న ఎలాన్​ మస్క్​
ట్విట్టర్​లో ఉద్యోగాల కోతను సమర్థించుకున్న ఎలాన్​ మస్క్​ (REUTERS/file)

Elon Musk Twitter layoffs : ట్విట్టర్​లో ఉద్యోగాల కోతపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ చర్యలపై విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. కాగా.. తన నిర్ణయాన్ని ఎలాన్​ మస్క్​ సమర్థించుకున్నారు. ట్విట్టర్​లో ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని అన్నారు. సామాజిక మాధ్యమం.. రోజుకు 4మిలియన్​ డాలర్లను కోల్పోతోందని.. కాస్ట్​ కటింగ్​ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

"ఉద్యోగాల కోత విషయం గురించి మాట్లాడాలి. దురదృష్టవశాత్తు వేరే ఆప్షన్​ కనిపించడం లేదు. కంపెనీకి.. రోజుకు 4 మిలియన్​ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. తొలగించిన ఉద్యోగులకు.. చట్టాలు చెబుతున్న దాని కన్నా ఎక్కువగానే 3 నెలల పాటు సెవరెన్స్​ ఇచ్చాము. ఒక విషయాన్ని మళ్లీ స్పష్టం చేస్తున్నా. కంటెంట్​ మాడరేషన్​కి సంబంధించి ట్విట్టర్​ పాలసీల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇంకా చెప్పాలంటే.. ఈ వారం రోజుల్లో హేట్​ స్పీచ్​లు సాధారణంగా కన్నా తగ్గాయి. మీడియాలో మీరు చూస్తున్నవి నిజం కాదు," అని ట్వీట్​ చేశారు ఎలాన్​ మస్క్​.

తాజా పరిణామాలతో ట్విట్టర్​ యాడ్​ రెవెన్యూ పతనమవుతోంది. దీనిపై స్పందించిన ఎలాన్​ మస్క్​.. 'యాక్టివిస్ట్​'లపై మండిపడ్డారు.

"ట్విట్టర్​ రెవెన్యూ భారీగా పతనవుతోంది. అడ్వర్టైజర్లను యాక్టివిస్ట్​ బృందాలు బెదిరిస్తున్నాయి, ఒత్తిడి చేస్తున్నాయి. అమెరికాలో ఫ్రీ స్పీచ్​ని ఈ యాక్టివిస్ట్​లు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు," అని మస్క్​ అన్నారు.

ట్విట్టర్​లో అసలేం జరుగుతోంది?

Twitter layoffs : 6 నెలల ఉత్కంఠకు తెరదించుతూ.. వారం రోజుల క్రితమే ట్విట్టర్​ను అధికారికంగా సొంతం చేసుకున్నారు అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​. వస్తూనే పూర్తిస్థాయి ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ట్విట్టర్​ సీఈఓ పరాగ్​ అగర్వాల్​తో పాటు అనేకమంది సీనియర్లను సంస్థను తప్పించారు. ఇక బ్లూ టిక్​ కోసం నెలకు 8డాలర్లు చెల్లించాలని నిబంధన తీసుకొచ్చారు.

ఇక ఉద్యోగాల కోతపై ఎలాన్​ మస్క్​ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక హాట్​ టాపిక్. కాస్ట్​ కటింగ్​, సంస్థ వృద్ధి పేరుతో.. భారీ సంఖ్యలో ఉద్యోగాలను కట్​ చేయాలని ఎలాన్​ మస్క్​ ఫిక్స్​ అయ్యారు. ఫలితంగా ఇండియాతో పాటు అంతర్జాతీయంగా ఉన్న ట్విట్టర్​ కార్యాలయాలు ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా.. అమెరికాలో చాలా మందికి ఇప్పటికే ఈమెయిల్స్​ అందాయి. ఇక ఆఫీసుకు రావొద్దంటూ ఈ మెయిల్స్​ స్పష్టం చేశాయి. ఇక కంపెనీ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Twitter India layoffs : ఇండియాకు కూడా ట్విట్టర్ 'ఉద్యోగాల కోత' సెగ తగిలింది! ట్విట్టర్​ ఇండియా ఉద్యోగుల్లో చాలా మందికి ఈమెయిల్స్​ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆఫీసులకు తిరిగి రావద్దని ఆ మెయిల్స్​లో ఉన్నట్టు సమచారం. మార్కెటింగ్​, కమ్యూనికేషన్స్​ డిపార్ట్​మెంట్​లను పూర్తిగా తొలగించినట్టు, అందులోని ఉద్యోగులతో పాటు పలువురు ఇంజనీర్స్​ను జాబ్స్​ నుంచి తప్పించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ట్విట్టర్ ఇండియాలో దాదాపు 250మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు అందరిని తొలగించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే.. ట్విట్టర్​ ఇండియాలో ఉద్యోగాల కోతపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. కాగా.. ఈ విషయంపై ట్విట్టర్​ ఇండియా కూడా ఇంకా స్పందించలేదు

IPL_Entry_Point

సంబంధిత కథనం