CUET UG 2024: కొత్త పోర్టల్ లో సీయూఈటీ యూజీ 2024 కి ఇలా అప్లై చేసుకోండి.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
CUET UG 2024: సీయూఈటీ యూజీ 2024 కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడానికి వీలుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త పోర్టల్ ను ప్రారంభించింది. సీయూఈటీ యూజీ 2024 కి అప్లై చేసే అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/CUET-UG ద్వారా అప్లై చేసుకోవచ్చు.
CUET UG 2024 notification: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ లేదా సీయూఈటీ యూజీ 2024 కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించే పోర్టల్ ను ఎన్టీఏ మంగళవారం ప్రారంభించింది. అభ్యర్థులు సీయూఈటీ యూజీ 2024 అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/CUET-UG/ లో ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మార్చి 26 లాస్ట్ డేట్
సీయూఈటీ యూజీ 2024 (CUET UG 2024) కోసం దరఖాస్తు ఫారాన్ని సమర్పించడానికి చివరి తేదీ 26 మార్చి 2024. సీయూఈటీ యూజీ 2024 రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ విండో మరియు ఫీజు చెల్లింపు విండో మార్చి 26, 2024 రాత్రి 11:50 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత, మార్చి 26 నుంచి మార్చి 28, 2024 రాత్రి 11.50 గంటలకు కరెక్షన్ విండో ఓపెన్ గా ఉంటుంది. సీయూఈటీ 2024 పరీక్ష సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ లను 2024 ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. సీయూఈటీ (యూజీ) - 2024 పరీక్షను భారతదేశం వెలుపల 26 నగరాలతో సహా మొత్తం 380 నగరాల్లో నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది.
మే రెండో వారం నుంచి అడ్మిట్ కార్డ్స్
అభ్యర్థులు సీయూఈటీ యూజీ (CUET UG 2024 registration) - 2024 అడ్మిట్ కార్డ్స్ ను మే రెండో వారం తర్వాత ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడితే, ఈ తేదీల్లో మార్పు చోటు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ ఫారాలను నింపకుండా చూసుకోవాలని ఎన్టీఏ కోరింది. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారాలను నింపడానికి వీల్లేదు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారాలను నింపిన అభ్యర్థులపై తదుపరి దశలో కూడా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఎన్టీఏ స్పష్టం చేసింది.
పరీక్షల తేదీలు..
సీయూఈటీ (యూజీ) - 2024 ప్రవేశ పరీక్షలు 2024 మే 15 వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నిర్వహించే అవకాశం ఉంది. అలాగే, ఈ పరీక్ష ఫలితాలు జూన్ 30, 2024న విడుదల చేసే అవకాశం ఉంది.
ఇలా అప్లై చేయండి..
సీయూఈటీ యూజీ 2024 (CUET UG 2024) కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాలి.
- ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/CUET-UG
- హోం పేజీపై కనిపించే అప్లికేషన్ ఫామ్ లింక్ ను క్లిక్ చేయాలి.
- వ్యక్తిగత వివరాలను నమోదు చేసి కొత్త అభ్యర్థిగా నమోదు చేసుకునేందుకు వీలు కల్పించే పేజీని తెరవండి.
- రిజిస్టర్ చేసుకుని మీ లాగిన్ వివరాలు పొందండి.
- లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
- ఫొటో సహా అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.
- ధృవీకరణ పేజీని డౌన్లోడ్ చేయండి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను, ధ్రువీకరణ పేజీని డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోండి.
అడ్మిషన్లు ఇలా..
సీయూఈటీ యూజీ 2024 పరీక్ష ఒక ఉమ్మడి స్క్రీనింగ్ పరీక్షగా పనిచేస్తుంది, ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దేశంలోని అనేక ఇతర భాగస్వామ్య సంస్థలతో పాటు అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది సీయూఈటీ-యూజీకి మార్కుల సాధారణీకరణను తొలగించే అవకాశం ఉందని, మూడో ఎడిషన్ కోసం కీలకమైన పరీక్షను పునఃసమీక్షించాలని ఎన్టీఏ యోచిస్తోందని యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ ఫిబ్రవరి 22న తెలిపారు. ఓఎంఆర్ షీట్లు, కంప్యూటర్ ఆధారిత పరీక్షతో సహా హైబ్రిడ్ విధానంలోఈ పరీక్షలను నిర్వహించాలని ఎన్టీఏ యోచిస్తోంది.
ఇకపై ఒక పేపర్ పరీక్ష ఒకే రోజులో..
విద్యార్థులకు వీలైనంత వరకు ఫస్ట్ చాయిస్ కేంద్రాన్ని అందించాలనే ప్రయత్నంలో గత రెండేళ్లుగా ఒకే పేపర్ పరీక్షను రెండు, మూడు రోజుల పాటు నిర్వహించాల్సి వచ్చింది. కానీ ఈ ఏడాది ఓఎంఆర్ విధానాన్ని అవలంబించడం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో పెద్ద సంఖ్యలో కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని, దేశవ్యాప్తంగా ఒకే రోజు పరీక్ష నిర్వహించేందుకు వీలు కలుగుతుందని ఎన్టీఏ భావిస్తోంది.