Bharat Jodo Yatra title song: కాంగ్రెస్ ‘భారత్ జోడో’ యాత్ర టైటిల్ సాంగ్ విడుదల
Bharat Jodo Yatra title song: కాంగ్రెస్ నిర్వహించనున్న ‘భారత్ జోడో’ యాత్రకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది.
Bharat Jodo Yatra title song: త్వరలో ప్రారంభం కానున్న 'భారత్ జోడో యాత్ర' ప్రచారానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని పాదయాత్ర నిర్దిష్ట రాష్ట్రానికి చేరుకున్న సందర్భాల్లో ఆయా భాషల్లో ఈ పాటను విడుదల చేస్తారు.
ఈ ప్రచారాన్ని bharatjodoyatra.in అనే ప్రత్యేక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. మంగళవారం తమిళంలో, సెప్టెంబర్ 11న మలయాళంలో, సెప్టెంబర్ 30న కన్నడలో టైటిల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు.
భారత్ జోడో అంటే 'మన్ కీ బాత్' కాదని, ప్రజల ఆందోళనలు, డిమాండ్లను కేంద్రానికి తీసుకెళ్లే కార్యక్రమం అని ఈ సీనియర్ కాంగ్రెస్ నేత తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో సమావేశమైన తర్వాత కన్యాకుమారిలోని వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం అధికారికంగా ఈ యాత్ర ప్రారంభించనున్నట్లు రమేష్ తెలిపారు.
భారత్ జోడో యాత్ర ద్వారా ప్రతిరోజూ 22-23 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. ప్రతి రోజు రెండు పూటలూ పాదయాత్ర ఉంటుంది. ఉదయం 7 నుండి 10:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 6:30 వరకు పాదయాత్ర సాగుతుంది.
భారత్ జోడో యాత్ర అన్ని రాష్ట్రాలను తాకుతూ వెళుతుందని, సంబంధిత రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని జైరాం రమేష్ తెలిపారు.
కాగా తెలంగాణలో అక్టోబర్ 24న రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశిస్తుందని, తెలంగాణలో మక్తల్‌లో ప్రవేశించి జుక్కల్‌లో ముగుస్తుందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తెలిపారు.
4 పార్లమెంట్, 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుందని వివరించారు. 15 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో సాగుతుందని, 5 బహిరంగ సభలు నిర్వహించనున్నామని బలరామ్ నాయక్ తెలిపారు.